
యువకుడి దారుణ హత్య
పాత కేసు రాజీ పేరుతో పిలిచి చంపేసినట్లు ఆరోపణలు
కాజ(మొవ్వ): మొవ్వ మండలం కాజ గ్రామ శివారు అయినంపూడి డ్రెయిన్‌లో యువకుడి మృతదేహం తేలుతూ కడపడటం బుధవారం కలకలం రేపింది. కూచిపూడి ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం కథనం మేరకు.. కాజ గ్రామానికి చెందిన రాజులపాటి వీరవెంకట రాజేష్ (27)కు అదే గ్రామానికి చెందిన జోగి శివ, మంద మధుసూదన్ రెడ్డి, బోళ్ల శ్రీను, తాతా హరి కృష్ణకు గత శివరాత్రి రోజు అన్నసమారాధన సమ యంలో గొడవ జరిగింది. దీనిపై మధుసూదన్ రెడ్డి కూచిపూడి పోలీస్ స్టేషన్‌లో రాజేష్‌పై కేసు పెట్టారు. ఈ కేసులో రాజీ చేసుకునేందుకు రావాల్సిందిగా హరికృష్ణ ఫోన్ చేసి పిలిపించినట్లు మృతుడైన రాజేష్ తల్లి రామ లక్ష్మి పోలీసులకు వెల్లడించారు. రాజేష్‌ను అతని స్నేహితుడు భరత్‌తో కలిపి హరికృష్ణ ఇంటికి పంపినట్లు చెప్పారు. అక్కడ వీర వెంకట రాజేష్‌పై పథకం ప్రకారం జోగి శివ, మధుసూదన్ రెడ్డి, బోళ్ల శ్రీను, తాతా హరికృష్ణ విచక్షణా రహితంగా కొట్టి హత్య చేసి, గ్రామ శివారులోని అయినంపూడి డ్రెయిన్‌లో పడేసినట్లు ఆరోపించారు.
ఘటనా స్థలం పరిశీలన..
గుడివాడ డీఎస్‌పీ ధీరజ్ వినీల్, పామర్రు సీఐ వి.సుభాకర్, కూచిపూడి ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం, బందరు క్లూస్ టీమ్ బృంద సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు డీఎస్పీ హామీ ఇచ్చారు. హతుని తల్లి రాజులపాటి రామ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి తల్లి, చెల్లి ఉన్నారు.

యువకుడి దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment