
పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా పంచా యతీ అధికారి జె. అరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 79 మంది గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–4కు, 19 మంది గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శులు, 19 మంది జూనియర్ అసిస్టెంట్లను గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేశారు. మొత్తం 117 పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి ఉద్యోగోన్నతులు కల్పించినట్లు డీపీవో అరుణ తెలిపారు.
‘ఇంటర్’ పరీక్షకు
18,280 మంది హాజరు
చిలకలపూడి(మచిలీపట్నం): ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం లెక్కలు, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 18,280 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మిడియెట్ ప్రాంతీయ అధికారి పీబీ సాల్మన్‌రాజు సోమవారం తెలిపారు. ఈ పరీక్షకు 18,500 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 220 మంది హాజరుకాలేదన్నారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 672 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 642 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 63 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేశాయని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని సాల్మన్‌రాజు తెలిపారు.
చికెన్ పాక్స్‌తో వ్యాపారి
మృతి
కోడూరు: చికెన్‌పాక్స్ (పొంగు జ్వరం)తో మండలంలోని మందపాకల గ్రామానికి చెందిన వ్యాపారి కోడూరు శ్యామ్ దుర్గాప్రసాద్ (43) ఆదివారం రాత్రి మృతి చెందాడు. దుర్గాప్రసాద్ ఐదు రోజులుగా చికెన్ పాక్స్ సోకడంతో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. నోటి నుంచి ఆహారం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కుటుంబీకులు స్థానిక ప్రైవేటు వైద్యుడితో వైద్యం చేయించారు. అయితే దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మందపాకల గ్రామంలో మృతుడు ఎరువు దుకాణంతో పాటు కిరాణా వ్యాపారం చేస్తాడు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పలువురు రాజకీయ నేతలు, వర్తక, వ్యాపార సంఘాల ప్రతినిధులు సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment