చెక్కు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు | - | Sakshi
Sakshi News home page

చెక్కు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు

Mar 18 2025 10:05 PM | Updated on Mar 18 2025 10:01 PM

చిలకలపూడి(మచిలీపట్నం): ఖాతాదారులకు చెక్కు మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్‌కుమార్‌, సభ్యులు నందిపాటి పద్మారెడ్డి, శ్రీలక్ష్మీరాయల సోమవారం తీర్పు చెప్పారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన కోనేరు సాత్విక్‌ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఈడ్పుగల్లు బ్రాంచ్‌లో సేవింగ్‌ ఖాతా ఉంది. 2017 నవంబర్‌ 6వ తేదీన రూ. 13.50 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ చెక్కు క్లియరెన్స్‌ నిమిత్తం సేవింగ్స్‌ ఖాతాల్లో దాఖలు చేశారు. ఆ చెక్కు నిమిత్తం కోనేరు సాత్విక్‌ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవటంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించగా చెక్కు కొరియర్‌ ద్వారా క్లియరింగ్‌కు పంపామని ట్రాన్సిట్‌లో మిస్‌ప్లేస్‌ అయ్యిందని తెలిపారు. దీంతో మరొక చెక్కును ప్రజెంట్‌ చేయాలని బ్యాంకు అధికారులు సాత్విక్‌కు చెప్పారు. ఖాతాదారుడు సాత్విక్‌ బ్యాంకు అధికారులు చేసిన పనికి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో పూర్వాపరాలను విచారించిన అనంతరం కమిషన్‌ సభ్యులు చెక్కు మొత్తం రూ. 13.50 లక్షలు 2017 నవంబర్‌ 6వ తేదీ నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని, లక్ష రూపాయలు మానసిక వేదనకు రూ. 10 వేలు ఖర్చుల నిమిత్తం 30 రోజుల్లోగా అందజేయాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

జి.కొండూరు: ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రీకొడుకులు యూటర్న్‌ తీసుకుంటున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో కొడుకు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామకు చెందిన తమ్మిశెట్టి నర్సింహారావు, ఆయన పెద్ద కుమారుడు రవి(42) ఇద్దరూ ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం 7గంటల సమయంలో మైలవరం మండల పరిధి గణపవరంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉదయం 10.30గంటల సమయంలో జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామం వద్దకు రాగానే ద్విచక్ర వాహనానికి మందు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకుంది. దీంతో ద్విచక్రవాహనం ఆ ట్యాంకర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమ్మశెట్టి రవి మీదుగా లారీ ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి నర్సింహారావుకి కూడా స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ఇరువురిని 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి నర్సింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ: వ్యక్తి మృతి

కృత్తివెన్ను: లారీ, బైక్‌ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రగాయాలపాలైన సంఘటన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం వద్ద సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు కథనం మేరకు 216 జాతీయ రహదారిపై లక్ష్మీపురం లాకు సెంటర్‌ సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా నాగిడిపాలెం నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వి. రాధాకృష్ణ (57) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి బర్రె నారాయణస్వామి తీవ్రగాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన నారాయణస్వామిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసులో నిందితులు అరెస్ట్‌

ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీలో ఈనెల 14వ తేదీ తెల్లవారుజామున రౌడీ షీటర్‌ జరబన వెంకటేష్‌ (41) హత్యకేసులో ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జూపూడి బస్టాప్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున సంచరిస్తున్న నిందితులు పొనమాల వేణు, చింతా వీరాంజనేయులు, కొప్పనాతి వీర్రాజును సీఐ ఏ.చంద్రశేఖర్‌ తన సిబ్బందితో అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పరిచామని సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. న్యాయమూర్తి ముగ్గురికి రిమాండ్‌ విధించినట్లు ఆయన చెప్పారు.

ఎండీయూ వ్యాన్‌పై విజిలెన్స్‌ దాడి

నిల్వ లెక్క తేలని 71 బియ్యం బస్తాలు గుర్తింపు

సంగమేశ్వరం(నాగాయలంక): మండలంలోని సంగమేశ్వరం, పాత ఉపకాలి చెందిన 36, 11నంబర్ల రేషన్‌ దుకాణాల ఎండీయూ వ్యాన్‌పై మంగళవారం రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి దాడి చేసి లెక్క ప్రకారం నిల్వ ఉండాల్సిన 71బస్తాల ఆచూకీ లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఈ రెండు షాపులను డీలర్‌ విశ్వనాథపల్లి ఉదయలోల నిర్వహిస్తున్నారు. షాపులను తనిఖీ చేయగా ఒక షాపు కింద 56బస్తాలు, మరో షాపు కింద 15బస్తాల రేషన్‌ బియ్యం తరుగు ఉండటాన్ని గుర్తించారు. ఎండీయూ వాహనాన్ని సీజ్‌ చేసి, తదుపరి చర్యలు నిమిత్తం పీడీఎస్‌ డెప్యూటీ తహసీల్దార్‌ ఖాసిమ్‌బాబుకు అప్పగించారు. కాగా పూర్తి వివరాలతో బుధవారం సమగ్ర నివేదికలు రూపొందించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీటీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement