చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా రూ. 340 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి ఆమె విచ్చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశమై ఎస్సీ కార్పొరేషన్ కార్యక్రమాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటివారం నుంచి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలను ప్రకటిస్తామన్నారు. ఉపాధి పథకం ద్వారా రూ. 10 లక్షలతో స్విఫ్ట్ డిజైర్ కార్లను నిరుద్యోగ యువకులకు అందజేయాలని ప్రతిపాదించామన్నారు. అలాగే రాష్ట్రంలో 4 వేల ఆటోలను మంజూరు చేయనున్నట్లు వివరించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం లక్ష, రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 వేలు, లబ్ధిదారులకు సబ్సిడీగా అందజేస్తామన్నారు. లబ్ధిదారులు కేవలం రూ. 15 వేలు డౌన్ పేమెంట్‌గా కడితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం అంద జేస్తుందన్నారు. రూ. 25 లక్షల వ్యయంతో విద్యుత్ వాహనాల చార్జింగ్ పాయింట్లు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో ఏర్పాటు చేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ షేక్ షాహెద్‌బాబు, డైరెక్టర్ వాసం మునయ్య పలువురు ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్
చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి


