గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయాలి
జిల్లా ఎస్పీ గంగాధరరావు
బంటుమిల్లి: పార్టీలు, ఎన్నికలు తాత్కాలికమని, ఆతర్వాత గ్రామస్తులు అందరూ కలసి గ్రామాభివృద్ధికి, గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయా లని ఎస్పీ ఆర్.గాంగధరరావు సూచించారు. మండలంలోని మల్లేశ్వరంలో బుధవారం రాత్రి జరిగిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో సర్పంచి చెన్ను శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. పార్టీలు, ఎన్నికలను కొంత వరకే పరిమితం చేయాలన్నారు. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వివాదాలు, గొడవలకు దూరంగా ఉండొచ్చని సూచించారు. గ్రామ ప్రజలు ఒకమాటపై నిలబడి పెద్దల సూచనలు పాటిస్తే నేరాల సంఖ్య గణణీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. యువకులు బెట్టింగ్‌లు, జూదాలు, మాద కద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత గ్రామస్తులతో మాట్లాడించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు చర్యలు తీసుకుంటానని ఎస్పీ గంగాధరరావు హామీ ఇచ్చారు. అంతకు ముందు బందరు డీఎస్పీ సీహెచ్.రాజ మాట్లాడుతూ.. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. తొలుత ఎస్పీ గంగాధరరావుకు సర్పంచి శ్రీనివాసరావు బొకే అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగేంద్ర ప్రసాద్, ఎస్‌ఐ గణేష్‌కుమార్, బంటుమిల్లి డీసీ చైర్మన్ బి.కాశీవిశ్వేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు కె.వీరబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జె.కొండలరావు, జి.శివయ్య, ఎం. గంగరాజు తదితరులు పాల్గొన్నారు.


