కోల్‌కతా రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్
ఘంటసాల: శిథిలావస్థకు చేరుతున్న ఘంటసాల బౌద్ధ మ్యూజియం పాడవకముందే అభివృద్ధి చేసి శిల్ప సంపదను ప్రభుత్వం సంరక్షించాలని కోల్‌కతాకు చెందిన రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్ అన్నారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఘంటసాల బౌద్ధారామాన్ని రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్ బృందం గురువారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఘంటసాల బౌద్ధారామాన్ని 10 నుంచి 15 సార్లు సందర్శించి పుస్తకాన్ని రాశానని, కాని ఎన్నిసార్లు సందర్శించినా బౌద్ధారామం కొత్తగానే కనిపిస్తుందన్నారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్ స్మితా హల్దార్‌కు సహకరించడానికి రేపల్లెకు చెందిన శాసన పరిశోధకులు డాక్టర్ బెల్లంకొండ రమేష్ చంద్ర, ఒంగోలుకు చెందిన చరిత్ర ఉపన్యాసకులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండా శ్రీనివాసులు, పాండిచ్చేరి యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బి.రామచంద్రారెడ్డి పాల్గొనగా ఈ బృందానికి ఘంటసాలలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, మ్యూజియం సిబ్బంది సహకరించారు.


