భానుడు భగభగ.. ప్రజలు విలవిల | - | Sakshi
Sakshi News home page

భానుడు భగభగ.. ప్రజలు విలవిల

Mar 28 2025 2:09 AM | Updated on Mar 28 2025 2:11 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్చి నాలుగో వారంలోనే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం పది రోజులుగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండగా, గత ఆది, సోమవారాల్లో కొంచెం తక్కువగా ఉంది. ఎండ తీవ్రతకు గురైన అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు దారి తీస్తున్నారు. ఈ ఏడాది ఎండలు ప్రజలకు కొత్త సమస్యలను తీసుకువస్తున్నాయి. దీంతో కొందరు ఎండలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మార్చిలోనే ఎండల పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెంత దారుణంగా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

5 డిగ్రీలు ఎక్కువ ప్రభావం

ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంఖ్య కంటే దాని ప్రభావం ఐదు, ఆరు డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఆల్ట్రా వైలెట్‌ కిరణాలు ఎక్కువగా పడటం, ఉష్ణ కిరణాలు బాగా వేడిని కలిగిస్తున్నాయంటున్నారు. ఓజోన్‌ పొర బలహీన పడకపోయినప్పటికీ గాలిలో ఉండే దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఖాళీ ప్రదేశం లేని ఇరుకు భవనాలు, మార్జిన్‌ లేని సిమెంటు రోడ్లు, విచ్చలవిడిగా ఏసీల వినియోగం ఇలా మార్చిలోనే తీవ్రమైన ఎండలకు కారణం అంటున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురైన వారు పలు సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు ఎండకు ఫోకస్‌ కాకుండా ఉండాలి. ఐదేళ్లలోపు పిల్లల్ని బయటకు పంపవద్దు. మంచినీరు ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకో వడం, మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం.

– డాక్టర్‌ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్‌ జిల్లా

కాంక్రీట్‌ జంగిల్‌తోనే అధిక ఉష్ణోగ్రతలు

ప్రస్తుతం విజయవాడ కాంక్రీట్‌ జంగిల్‌గా మారడంతో మార్చిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెట్లు లేకపోవడం, ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటిని అనుకుని ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వంటి కారణాలతో చల్లని వాతావరణం కొరవడింది. ఈ పరిస్థితి మారాలంటే సాయంత్రం నీళ్లు చల్లడం చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేపట్టాలి.

– డాక్టర్‌ ఎ.శ్రీకుమార్‌, వాతావరణ శాస్త్రవేత్త

జాగ్రత్తలు తప్పనిసరి

ఎండలోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మంచినీరు ఎక్కువగా తాగటం, తీవ్రమైన ఎండకు ఫోకస్‌ కాకుండా ఉండాలి.

మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

అనారోగ్య సమస్యలివే..

ఎండ తీవ్రతకు గురైన వారిలో కింద పేర్కొన్న లక్షణాలు గోచరిస్తున్నాయి.

ఆకస్మికంగా వాంతులు, విరోచనాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది.

చలితో కూడిన జ్వరం కూడా వస్తున్నట్లు చెబుతున్నారు.

తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు.

వికారంగా ఉండటం, ఆకలి లేక పోవడం వంటి లక్షణాలు ఉంటున్నాయి.

ఎండలో తిరిగే వారిలో చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు

కొందరికి చర్మంపై దురదలు వస్తున్నాయి.

ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

కొత్త సమస్యలతో బాధపడుతున్న వైనం

ఎండల తీవ్రతకు వాంతులు, విరేచనాలు

చలితో కూడిన జ్వరం, తీవ్రమైన నీరసం

ఇప్పటికే జిల్లాలో చాలా మందిలో ఈ లక్షణాలు

అప్రమత్తంగా ఉండాలనివైద్యనిపుణుల సూచన

భానుడు భగభగ.. ప్రజలు విలవిల1
1/2

భానుడు భగభగ.. ప్రజలు విలవిల

భానుడు భగభగ.. ప్రజలు విలవిల2
2/2

భానుడు భగభగ.. ప్రజలు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement