ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు
కోనేరుసెంటర్: జిల్లాలోని పోలీసు కుటుంబాలతో పాటు ముస్లిం సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని అల్లాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ ముస్లిం కుటుంబాల్లో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. అలాగే అందరూ ఐకమత్యంతో కులమతాలకతీతంగా సోదరభావంతో మెలగాలని కాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
కోనేరుసెంటర్: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటనపై ఆదివారం రాత్రి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం మేకవానిపాలెం పంచాయతీ హమాలీ కాలనీకి చెందిన కట్టా నాగమల్లేశ్వరరావు(54) ట్రాక్టర్ నడుపుతుంటాడు. శనివారం మధ్యాహ్నం కాలనీ నుంచి జెడ్పీ సెంటర్ వైపు వెళ్తుండగా ఒక్కసారి తూలు రావటంతో ట్రాక్టర్ చిలకలపూడి సెంటర్‌లోని డివైడర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగమల్లేశ్వరరావు ట్రాక్టర్‌పై నుంచి జారి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది తలకు గాయం కావటంతో కుట్లు వేసి పంపించారు. అర్ధరాత్రి మరలా ఇబ్బంది కావటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. విజయవాడ ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు వివరాలు నమోదు చేసుకునేందుకు విజయవాడ వెళ్లినట్లు చిలకలపూడి పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిలో పున్నమి ఘాట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని భవానీపురం పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. మృతుడి ఒంటిపై నలుపు, ఎరుపు రంగు గళ్ల షర్ట్, తెలుపు రంగుపై బ్లూ కలర్ గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. 40వ డివిజన్ 121 సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి నల్లూరి శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.


