విజయమియ్యవే విశ్వావసు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, అర్చన అనంతరం ఉదయం 8.15 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారికి అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్, ఇతర అధికారులు అమ్మవారిని తొలుత దర్శించుకున్నారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా నూతన పూజా మండపానికి తీసుకువచ్చారు. వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను జరిపించారు.
నూతన మండపంలో ప్రత్యేక పుష్పార్చన
ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్, డీఈవో రత్నరాజు, ఈఈ కోటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన ఆదివారం అమ్మవారికి మల్లెలు, మరువంతో ఆలయ అర్చకులు అర్చన నిర్వహించారు. అనంతరం పంచహారతుల సేవ నిర్వహించి ఉభయదాతలకు ప్రసాదాలను అందజేశారు. భక్తులకు పుష్పార్చనలో వినియోగించిన పుష్పాలను పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ కౌంటర్ వద్ద ఉగాది పచ్చడిని అందజేశారు.
అంతరాలయ దర్శనం రద్దు..
ఉగాదికి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 8.15 గంటలకు దర్శనం ప్రారంభమయ్యే సమయానికి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఉదయం నుంచే మహా మండపం దిగువన, ఘాట్‌రోడ్డులోని కౌంటర్ల రూ. 500 టికెట్లు విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. ముందుగానే ఆన్‌లైన్‌లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వీఐపీ క్యూలైన్‌లోకి అనుమతించారు. దీంతో అరగంట లోపే వారికి అమ్మవారి దర్శనం పూర్తయింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 100, రూ. 300 టికెట్టుపై దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మజ్జిగ పంపిణీ..
వేసవిని నేపథ్యంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. లక్ష్మీ గణపతి ప్రాంగణం, మహా మండపం 7వ అంతస్తులోని తులాభారం వద్ద భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. దాతల సహకారంతో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మజ్జిగ పంపిణీ జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
వెండి రథంపై ఆది దంపతులు
ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథోత్సవంపై నగరోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం వద్ద ఆదిదంపతులకు ఈవో కె. రామచంద్రమోహన్ దంపతులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. స్థానాచార్య శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, ఈఈ వైకుంఠరావు, ఉభయదాతలు, భక్తులు పాల్గొని తరించారు.
కొత్త సంవత్సరాది వేళ భక్తుల ప్రత్యేక పూజలు
కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
తెల్లవారుజామున దుర్గమ్మకు
స్నపనాభిషేకం
ఉదయం 8.15 గంటలకు
ప్రారంభమైన దర్శనం
కనులపండువగా ఆది దంపతుల
నగరోత్సవం
విజయమియ్యవే విశ్వావసు


