అందరికీ యోగదాయకమే
మచిలీపట్నంటౌన్: నూతన తెలుగు సంవత్సరాది అన్ని వర్గాల ప్రజలకు యోగదాయకంగా ఉంటుందని పంచాగకర్త విష్ణుభట్ల సూర్యనారాయణశర్మ అన్నారు. నగరంలోని బచ్చుపేట శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీవిశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన సూర్యనారాయణశర్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులకు, కార్మికులకు, పాలకులకు, అధికారులకు అందరికీ యోగదాయకమైన, అనుకూలమైన సంవత్సరంగా ఉంటుందన్నారు.
మంచి ఆలోచనలతో ముందడుగు..
ప్రతి ఒక్కరూ చేసిన తప్పులను వదిలేసి కొత్త తెలుగు సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని పునఃప్రారంభించుకునేందుకు మొదటి అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. అనంతరం పంచాంగకర్తలను ఘనంగా సన్మానించారు. గంటల పంచాంగాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, మజ్జిగ ప్రసాదాల పంపిణీ చేశారు.
పలువురికి సత్కారాలు..
ఆగమశాస్త్రంలో నిష్ణాతులైన అర్చక స్వాములు అగ్నిహోత్రం యుధిష్టిర కోదండపాణి, మురికిపూడి సత్యనారాయణ, రొంపిచర్ల విజయ సారధి కృష్ణమాచార్యులు, ఐలూరి మల్లికార్జునరావులను రూ. 10,116 నగదు పురస్కారం తోపాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అర్చకులు ఘంటసాల భాస్కర శర్మ, జూనియర్ అసిస్టెంట్ బొప్పన వీర కోటేశ్వరరావు, కార్యనిర్వహణ అధికారి సింగనపల్లి శ్రీనివాసరావు, అటెండర్ నరహరిశెట్టి సోమశేఖర్, తనిఖీదారులు కోటిపల్లి అనురాధ, నాదస్వరం విద్వాంసుడు క్రొవ్విడి శివబాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి సమ్మెట ఆంజనేయస్వామిలకు ఉగాది సేవా పురస్కారాలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు.
పంచాంగకర్త విష్ణుభట్ల
సూర్యనారాయణశర్మ
ఉగాది వేడుకల్లో పాల్గొన్న
కలెక్టర్ డీకే బాలాజీ
ఆకట్టుకున్న కవి సమ్మేళనం..
ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనం అమితంగా ఆకట్టుకుంది. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అప్పికట్ల దీప్తి వీణ వాయిద్య ప్రదర్శన, చింతలపాటి పూర్ణచంద్రరావు శిష్య బృందం ప్రదర్శించిన కోలాటం, కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. వీరిని కూడా ఘనంగా సన్మానించారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకట సాంబశివరావు, కేఆర్‌ఆర్‌సీఎస్ డీసీ శ్రీదేవి, ఇన్‌చార్జ్ ఆర్డీఓ సీహెచ్ పద్మావతి, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ యోగదాయకమే


