చేతికొచ్చే సమయంలో పంట ధ్వంసం
మైలవరం: ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి కొంతమంది వ్యక్తులు ఆ పంటను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మైలవరం పొందుగల రోడ్డులోని భవానీనగర్‌కు సమీపంలో తనకు పొలం ఉందని, 2012లో తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నానని మైలవరానికి చెందిన రైతు బొమ్మారెడ్డి రవికుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది పొలంలో గుమ్మడి పంట సాగు చేశానని, నాలుగైదు రోజుల్లో కాపుకొచ్చిన గుమ్మడి కాయలు కోద్దామని అనుకుంటున్న సమయంలో గత రాత్రి వజ్రాల వెంకటేశ్వరరెడ్డి మరి కొంతమందితో కలిసి ట్రాక్టర్‌ను తీసుకువచ్చి పంటను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టానని, పంట ధ్వంసం చేయడంతో చిల్లి గవ్వ కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. దొంగ సంతకాలు సృష్టించి తనను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. దీనిపై మైలవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రవికుమార్‌రెడ్డి తెలిపారు. రవికుమార్ రెడ్డికి చెందిన భూమిని కొంతమంది దొంగ పత్రాలు సృష్టించడంలో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్‌ఐ సుధాకర్‌ను వివరణ కోరగా పంట ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని, డ్రైవర్ దొరకలేదని తెలిపారు.


