15 వరకు వంశీమోహన్‌ రిమాండ్‌ పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

15 వరకు వంశీమోహన్‌ రిమాండ్‌ పొడిగింపు

Apr 2 2025 1:20 AM | Updated on Apr 3 2025 12:51 PM

గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన స్థల వివాదం కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ రిమాండ్‌ను గన్నవరం 8వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో రిమాండ్‌ మంగళవారంతో ముగియడంతో విజయవాడ జిల్లా జైలులో ఉన్న వంశీమోహన్‌ను పోలీసులు ఆన్‌లైన్‌ విధానంలో కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. వంశీమోహన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కూడా వాదనలు జరిగాయి. ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి బి.శిరీష విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

గల్లంతైన బిహార్‌ యువకుడి మృతదేహం లభ్యం

జగ్గయ్యపేటఅర్బన్‌: పట్టణం సమీపంలోని పాలేటిలో మహమ్మద్‌ ఫైజాన్‌(22) అనే బిహార్‌కు చెందిన యువకుడు సోమవారం సాయంత్రం గల్లంతవగా అతని మృతదేహం మంగళవారం లభ్యం అయింది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని స్నేహితుడు భాషిత్‌ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం జగ్గయ్యపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 
స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు సరదాగా వచ్చిన ఫైజాన్‌ పాలేటిలోకి దిగడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. స్నేహితులు ఫైజాన్‌ను బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. మృతుని స్నేహితుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ జి.రాజు ఆధ్వర్యంలో పోలీసులు పాలేటిలో గాలింపుచర్యలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఆచూకీ లభించడంతో పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు ఫైజాన్‌ బిహార్‌ రాష్ట్రంలోని బడి శంఖ గ్రామానికి చెందిన అవివాహితుడు.

ఉరి వేసుకుని మహిళ మృతి

కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరేసుకుని మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు బండారు శివరూపిణి(32) అనే అవివాహిత ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కృష్ణలంక, తిరుమలరావువీధిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. గత రెండు నెలలుగా ఆమె తన తండ్రి రమేష్‌బాబుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటోంది. సిగరెట్‌ తాగొద్దని తండ్రికి చెబుతున్నా ఆయన మానుకోవడంలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కూడా సిగరెట్‌ తాగొద్దని చెప్పినా వినకపోవడంతో ఆమె కోపంతో రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు శివకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement