చందర్లపాడు(నందిగామ టౌన్): చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించే బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి గ్రామంలోని దేవాలయాలు, ఖాళీ స్థలాలు, భూములు, తదితరాలను పరిశీలించినట్లు తెలిపారు. సభ ఏర్పాట్లపై కలెక్టర్, అధికారులతో ఆమె చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్ర బాబు నాయుడు నియోజకవర్గానికి వస్తున్నారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్డీవో బాల కృష్ణ, లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు పాల్గొన్నారు.
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి
లబ్బీపేట(విజయవాడతూర్పు): హై రిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి, వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె జిల్లాలో జరుగుతున్న ఎన్‌సీడీ– సీడీ సర్వేను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, గర్భిణుల నమోదు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పరిశీలించారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ సేవలపై ఆరా తీశారు. అనంతరం బూరుగగూడెం, రంగాపురం సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ–సీడీ సర్వేను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును స్వయంగా ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. రెడ్డిగూడెం వైద్యాధికారి డాక్టర్ మణిబాబు, సీహెచ్‌ఓ శ్యాం సుందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వరంగల్‌కు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. వరంగల్‌కు చెందిన సీహెచ్ రమేష్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండి తులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు దాతలను అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.
అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో చైత్రదీపిక సత్తా
విజయవాడస్పోర్ట్స్: తైవాన్‌లో జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి చైత్రదీపిక మూడు పతకాలతో సత్తా చాటింది. గత నెల 24 నుంచి 30వ తేదీ వరకు తైవాన్‌లో జరిగిన ఈ పోటీలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఉత్తరకొరియా, ఇటలీ, సింగపూర్, భారత దేశాల క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చైత్రదీపిక పెయిర్ విభాగంలో బంగారు పతకం, ఇన్‌లైన్ విభాగంలో కాంస్యం, కపుల్ డ్యాన్స్‌లో రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడాకారిణి చైత్రదీపిక పటమటలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడాకారిణిని శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కోచ్ పి. సత్యనారాయణను పలువురు క్రీడాభిమానులు అభినందించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన


