ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రతి నిత్యం విశేష పుష్పార్చన జరుగుతుంది. నాల్గో రోజైన బుధవారం దుర్గమ్మకు మందార పూలు, ఎర్ర కలువలు, మల్లెలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత రాజగోపురం నుంచి అమ్మవారికి అర్చన నిమిత్తం తీసుకువచ్చిన పుష్పాలను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకువచ్చారు.
అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రత్యేక పుష్పార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు.
యాదవ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన జి.నరసింహయాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఫైల్‌పై సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ సభకు వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై నరసింహయాదవ్‌ను అభినందించారు. మంత్రులు కొలుసు పార్థసారథి, సవిత, రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, ఎమ్మెల్సీ డి.రామారావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, టీటీడీ బోర్డ్ సభ్యులు పనబాక లక్షి, జంగా కృష్ణమూర్తి, బీసీ నాయకురాలు నూకాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఉచిత పాలీసెట్ శిక్షణ
గుడ్లవల్లేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉచితంగా పాలీసెట్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.రాజశేఖర్ బుధవారం తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి పాలీసెట్ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. పాలీసెట్ ఈ నెల 30న జరుగుతుందన్నారు.
దుర్గమ్మకు ఎర్రకలువలు, మందార పుష్పాలతో అర్చన


