నేటి నుంచి పది స్పాట్
మచిలీపట్నంఅర్బన్: జిల్లా కేంద్రమైన మచిలీ పట్నంలో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్‌కు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకూ మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ స్పాట్ వాల్యూయేషన్ జరగనుంది. పదో తరగతి పరీక్షలు గత నెల 17వ తేదీన ప్రారంభమై ఈ నెల ఒకటో తేదీన ముగిసిన విషయం తెలిసిందే. జిల్లాలో 22,341 మంది విద్యార్థులు 145 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. ఇప్పటికే విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి కోడింగ్ ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు.
సర్వం సిద్ధం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం గురువారం ప్రారంభంకానుంది. లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ఎం.డేవిడ్ రాజు బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 1,91,627 జవాబు పత్రాలు అందాయన్నారు. సీఈలు 134 మంది, ఏఈలు 794 మంది, ఎస్‌ఏలు 268 మంది చొప్పున మొత్తం 1,196 మంది మూల్యాంకనం విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టానున్నారన్నారు. ఇప్పటికే జవాబు పత్రాల కోడింగ్ పూర్తి అయింది. చివరిగా నిర్వహించిన పరీక్ష సాంఘిక శాస్త్రం కోడింగ్ బుధవారం పూర్తయింది. పూర్తి బందోబస్తు మధ్య మూల్యాంకనం జరగనుందని డెప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ఎం.డేవిడ్ రాజు తెలిపారు.
మూల్యాంకనం ఇలా..
మూల్యాంకనం కేంద్రంలో మొత్తం 16 గదులు, ఆరు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక చీఫ్ ఎగ్జామినర్, ఆరుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు, ఇద్దరు స్పెషల్ అసిస్టెంట్లు ఒక టీంగా వ్యవహిస్తారు. మొత్తం సిబ్బందిని 134 టీములుగా విభజించారు. ఒక్కొక్క అసిస్టెంట్ ఎగ్జామినర్ ఉదయం 20, మధ్యాహ్నం సెక్షన్లో 20 చొప్పున జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంది. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించారు. వేసవి నేపథ్యంలో అన్ని గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కేంద్రం వద్ద తాగునీరు, వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు భోజనం, అల్పాహారం కోసం ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం జిల్లాకు 1,91,627 సమాధాన పత్రాల రాక 1,196 మంది సీఈ, ఏఈలు, ఎస్‌ఏలకు విధుల కేటాయింపు
ఒరియంటేషన్ నిర్వహించిన అధికారులు
మూల్యాంకన విధులకు ఆయా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులను ఆయా జిల్లా విద్యాశాఖాధికారులు జారీ చేశారు. స్పాట్ వాల్యూయేషన్ ఉత్తర్వులను ఉపాధ్యాయులకు అందజేసే ప్రక్రియ దాదాపుగా ముగిసింది. జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులను నియమించారు. ఎనిమిది రోజుల పాటు మూల్యాంకనం చేస్తారు. దానికి సంబంధించి బుధవారం స్పాట్ జరిగే ప్రాంగణంలో ఉపాధ్యాయులకు ఇతర అధికారులకు ఒరియేంటేషన్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.
నేటి నుంచి పది స్పాట్


