వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని ఉపాలయం నుంచి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీపై ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా, ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నా, వీక్షించినా భక్తుల ఇంట సకల శుభాలు కలుగుతాయని, సంతానం లేని వారికి సంతాన యోగం, వివాహం కాని వారికి వివాహ యోగం కలుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఉభయ దాతలకు ప్రత్యేక క్యూ మార్గం ద్వారా ఆది దంపతుల దర్శనానికి అనుమతించారు.
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం


