బందరుకోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నంఅర్బన్: మచిలీపట్నం వారసత్వ సంపద గల చారిత్రాత్మక నగరమని, బందరు కోటను పర్యాటక సర్క్యూట్‌లో మార్చేందుకు పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధికారులతో కలిసి నగరంలోని బందరుకోట, డచ్ వారి సమాధులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ, విజయవాడ సహాయ సంచాలకులు స్వామి నాయక్ మాట్లాడుతూ బందరుకోట 17వ శతాబ్దంలోనిదన్నారు. కేంద్ర పురావస్తుశాఖ కన్సల్టెంట్ అసిస్టెంట్ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ మొదటి దశలో బందరు కోటలో పైకప్పు పునరుద్ధరణ, గన్ పౌడర్ మ్యాగజైన్ మరమ్మతు పనులు చేపట్టాలని అంచనాలు రూపొందించామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకు బందరు కోటను సందర్శించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించినప్పటికీ ఏమాత్రం పనులు జరగలేదని.. ఇకనైనా ఈ విషయం తీవ్రంగా పరిగణించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే ఢిల్లీలోని పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ వెంట కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఉప పర్యవేక్షకుడు ఎంఎస్ శివకుమార్, రాష్ట్ర పురావస్తు శాఖ ఉపసంచాలకులు సురేష్, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


