
రైతుకు సహకార నిరాకరణ!
● పది నెలల్లో సహకార సంఘాల్లో పాలన అస్తవ్యస్తం ● ప్రభుత్వం మారగానే ఆగిపోయిన గోడౌన్‌ల నిర్మాణం ● రుణాల మంజూరు అంతంతమాత్రమే ● గత ప్రభుత్వంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా పరుగులు పెట్టిన వ్యవస్థ
కూటమి నిర్వాకంతో వ్యవస్థ నిర్వీర్యం
జి.కొండూరు: గ్రామస్థాయిలో రైతు బ్యాంకులుగా పేరొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. దశాబ్దాలుగా రైతులకు సేవలందించిన ఈ సహకార సంఘాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు సమర్థనీయ సేవలను అందించడంలో విఫలమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ పది నెలల కాలంలో సంఘాలకు పాలనా కమిటీలను నియమించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో వ్యవస్థ కుంటుపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సకల వసతులతో అన్ని రకాల సేవలను అందించిన ఈ సహకార సంఘాలు ఇప్పుడు నామమాత్రపు సంఘాలుగా మారుతున్నాయి.
గోడౌన్‌లపై వివక్ష ఎందుకు?
రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు వీలుగా గోడౌన్ విత్ ప్లాట్‌ఫారంల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలో సహకార సొసైటీల ఆధ్వర్యంలో చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.21.44కోట్లతో 52చోట్లు గోడౌన్ విత్ ప్లాట్‌పారంలను నిర్మాణాలు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వంలోనే 50శాతంకి పైగా గోడౌన్‌లు పూర్తి చేసి ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల మంజూరులో జాప్యం జరగడంతో వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాలు పూర్తయిన గోడౌన్‌లకు సైతం రహదారి సమస్యలు వంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు గోడౌన్‌ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంతో సహకార సంఘాలు విఫలం కావడంతో వినియోగంలోకి రాలేదు. అంతే కాకుండా నిర్మాణ దశలో ఆగిపోయిన గోడౌన్‌లు సంచార జీవనం సాగించే కుటుంబాలకు ఆవాసాలుగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.
పక్కా భవనాలు కూడా..
అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో పీఏసీఎస్‌లు 131, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్‌లు 22కి గానూ 98 నూతన భవనాలు, కొన్ని భవనాలకు అదనపు గదులు నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.28.36కోట్లు కేటాయించారు. వీటిలో 80శాతంకి పైగా భవనాల నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి.
గత ప్రభుత్వంలో బలోపేతం ఇలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సహకార వ్యవస్థ పరుగులు పెట్టింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణల వల్ల అధునిక వసతుల కల్పనతో పాటు రుణాల మంజూరు, టర్నోవర్, డిపాజిట్‌లు ఇలా అన్ని రంగాలలో సహకార వ్యవస్థ బలోపేతమై లాభాల బాటలో నడిచింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 57 కేడీసీసీ బ్రాంచ్‌లు, రెండు ప్రధాన కార్యాలయాలు, 6 జిల్లా కో ఆపరేటివ్ ప్రోసెసింగ్ సెంటర్లు, 425సొసైటీలు ఉన్నాయి.
● కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో చివరి ఏడాది 2019కి మొత్తం రుణాలు రూ.3,201.21 కోట్లు ఉండగా మొత్తం టర్నోవర్ రూ.5,138.46 కోట్లు ఉంది. షేర్ క్యాపిటల్ రూ.170.12 కోట్లు, రిజర్వ్ ఫండ్స్ రూ.148.33 కోట్లు, డిపాజిట్లు రూ.1,937.25కోట్లుగా ఉన్నాయి.
● 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు ఐదేళ్ల పాలనలో మొత్తం రుణాలు రూ.8,134.51కోట్లు ఉండగా మొత్తం టర్నోవర్ రూ.11,279.48కోట్లుగా ఉంది. షేర్ క్యాపిటల్ రూ.390.75కోట్లు, రిజర్వ్ ఫండ్స్ రూ.308.54కోట్లు, డిపాజిట్లు రూ.3,144.97 కోట్లుగా ఉన్నాయి.
రుణాల మంజూరు లేదు..
నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లాభాల బాట పట్టించింది. సహకార సంఘాలకు అదనపు ఆదాయం కోసం పెట్రోలు బంకులు, మినరల్ వాటర్ ప్లాంట్‌లు, మెడికల్ దుకాణాలు ఏర్పాటు చేశాం. గోడౌన్‌ల పట్ల ప్రస్తుత ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గం. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గోడౌన్‌ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. రుణాల రికవరీ టార్గెట్ పూర్తి కాలేదని రుణాలు మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. ప్రత్యేక అధికారుల పాలన వల్ల సంఘాల్లో పారదర్శకత ఉండదు. రైతుల పట్ల ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలనా కమిటీలను ఏర్పాటు చేసి సహకార సంఘాలను బలోపేతం చేయాలి.
– తన్నీరు నాగేశ్వరరావు,
కేడీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ
జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్
సహకార సంఘాలకు కూటమి ప్రభుత్వం పాలనా కమిటీలను ఏర్పాటు చేయకుండా ప్రత్యేక అధికారులతో వ్యవస్థను నడిపిస్తున్న క్రమంలో రుణాల మంజూరు అంతంతమాత్రంగానే సాగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25సంవత్సరానికి 60శాతం మాత్రమే రుణాలను రైతులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక అధికారుల పాలన రైతులకు రుణాల మంజూరులో తలనొప్పిగా మారినట్లు సమాచారం. రుణాల రికవరీ టార్గెట్‌లు పూర్తికాలేదని రుణాల మంజూరును ఆపేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

రైతుకు సహకార నిరాకరణ!

రైతుకు సహకార నిరాకరణ!