‘పది’ స్పాట్ వాల్యూయేషన్ పరిశీలన
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలో జరుగుతున్న పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్‌ను జిల్లా పరిశీలకునిగా నియమితులైన ఏపీ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ శుక్రవారం పరిశీలించారు. నగరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్‌లో పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు 800 మంది ఉపాధ్యాయులు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం నియమించిన పరిశీలకులు కృష్ణమోహన్ శుక్రవారం స్పాట్ ప్రాంగణాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగుతుందన్నారు.


