వాటర్ ట్యాంకు ఎక్కిన మహిళను కాపాడిన యువకుడు
చల్లపల్లి: స్థానిక నారాయణరావు నగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కిన ఓ మహిళను ఓ యువకుడు శనివారం కాపాడాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానికంగా నివాసం ఉండే ఓ ముస్లిం యువతి వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఏడుస్తూ నిలబడింది. ఆదమరిస్తే కిందకు పడిపోయే పరిస్థితిలో అటూ ఇటూ కదులుతున్న ఈ యువతిని కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అప్పటికే స్థానికంగా ఉండే యువకులు చెంబురెడ్డి మణి, తళ్లూరు విష్ణుభరత్‌లతో పాటు మరి కొంతమంది ట్యాంక్ ఎక్కారు. కిందకు దిగాలని ఆమెను కోరగా, ఆమె ఏడుస్తూ ఒక్కో అడుగు ముందుకేయడంతో అందరూ తీవ్ర ఆందోళన చెందారు. సీఐ ట్యాంక్ ఎక్కి వెనక్కు వచ్చేయాలని కోరారు. మహిళతో మాట్లాడుతూ ఆమె భర్త ఫోన్ నంబర్ చెప్పాలని కోరుతూ ఆమెని మాటల్లో పెట్టారు. అనంతరం చెంబురెడ్డి మణి చుట్టూ తిరిగివెళ్లి ఆ మహిళను గట్టిగా పట్టుకుని కిందకు పడకుండా వెనక్కి లాగాడు. అనంతరం సీఐ ఆ మహిళలను ట్యాంకుపై నుంచి కిందకు తీసుకొచ్చారు. ఆమెకు కుటుంబ సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య పరిస్థితి బాగుండక పోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్టు చెప్పారు. మహిళను సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


