పెనమలూరు: చోడవరం గ్రామంలో మొక్కజొన్న మెషీన్‌లో శనివారం ప్రమాదవశాత్తు మహిళ పడి దుర్మరణం చెందింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన తుమ్మలజ్యోతి(30) సహచర కూలీలతో కలిసి చోడవరం గ్రామానికి మొక్కజొన్న గింజలు ఓలిచే పనులకు వచ్చింది. వారు ఉదయం నుంచి మెషీన్ యజమాని శ్రీనివాసరావుతో కలిసి చోడవరం నాగేంద్రస్వామివారి ఆలయ సమీపంలో కౌలు రైతుకు చెందిన పొలంలో మొక్కజొన్న కండెలను మెషీన్‌లో వేస్తూ పనులు చేశారు.
సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలి రావటంతో మొక్కజొన్న పంట వద్ద ఉన్న టార్పాలిన్ పట్టా గాలికి ఎగరటంతో జ్యోతి పట్టాను పట్టుకోవటానికి యత్నించగా ఆమె చీర మెషీన్‌కు చుట్టుకుని ప్రమాదవశాత్తు మొక్కజొన్న మెషీన్‌లో పడింది. మెషీన్ తిరుగుతుండటంతో జ్యోతి మెషీన్‌లోనికి సగభాగం వెళ్లింది. ఈ ఘటనలో ఆమె తల ముక్కలైంది. అక్కడే ఉన్న ఇతర కూలీలు మెషీన్‌ను ఆపారు. అయితే ఆమె శరీరం నుజ్జుకావటంతో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


