మహిళల రక్షణకు మరిన్ని చర్యలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మహిళలతో పాటు చిన్నారుల భద్రతకు పోలీసు అధికారులు, సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఆర్.గంగాధరరావు ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో ఆయన గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు సమావేశపు హాలులో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగికదాడులను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
నేరాలపై నిఘా..
మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాల విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే విచారణ పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలపై జరుగుతున్న దాడులు నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. పిల్లలకు బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ గురించి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
గంజాయి రహిత జిల్లాగా..
కృష్ణా జిల్లాని గంజాయి రహితంగా మార్చడానికి పోలీసు సిబ్బంది అందరూ కృషి చేయాలని ఎస్పీ గంగాధరరావు కోరారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌డీపీఎస్ కేసుల విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామన్నారు. నిర్జన ప్రదేశాలు, గంజాయి తాగడానికి ఎక్కువగా అవకాశం ఉండే ప్రాంతాలని గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
చోరీల నియంత్రణకు నైట్‌బీట్
జిల్లాలో చోరీలు జరగకుండా చర్యలు తీసుకో వాలని ఎస్పీ గంగాధరరావు ఆదేశించారు. అందుకోసం నైట్ బీట్ సంఖ్యను పెంచి సీసీఎస్ టీమ్‌లను కూడా నైట్ బీట్ డ్యూటీలకు కేటాయించాలని సూచించారు. బీట్ కానిస్టేబుళ్లు తమ తమ ప్రాంతాల్లో సస్పెక్ట్ షీట్ హోల్డర్లు, డీసీషీట్, కేడీషీట్ హోల్డర్ల కదలికలపై నిఘా పెంచాలని స్పష్టంచేశారు. నేరస్తులు వేసవిలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, గస్తీని మరింత పెంచాలన్నారు.
రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ గంగాధరరావు ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సైన్ బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాన్ని గుర్తించి విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
సైబర్ క్రైమ్ టీముల ఏర్పాటు
జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక సైబర్ క్రైమ్ టీములను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సైబర్ కేసుల విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరి గేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులు నేరస్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి జిల్లా నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ
గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలి
పోలీసు అధికారులు తమ పరిధిలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడ ఎలాంటి నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని ఎస్పీ గంగాధరరావు సూచించారు. తమ పరిధిలో ఉన్న గ్రామాలను సంద ర్శించి పల్లెనిద్ర కార్యక్రమాలను చేపట్టి, అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శాంతి భద్రతలను పరిరక్షించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన పెండింగ్ కేసులు, కేసుల పురోగతి, చార్జి షీట్ దాఖలు, కోర్టు ట్రయల్స్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు వి.వి. నాయుడు, బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణలో ప్రతిభచాటిన సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు.


