పెడనలో ముస్లింల భారీ ర్యాలీ
పెడన: వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయకపోతే ప్రాణత్యాగాలకు సైతం సిద్ధంగా ఉంటామని, తక్షణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు, జామియా మసీదు కార్యదర్శి అయూబ్‌ఖాన్ అన్నారు. పెడన జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు అబ్దుల్‌ఖదీర్, మసీదు కార్యదర్శి అయూబ్ ఖాన్‌ల ఆధ్వర్యాన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అయూబ్ ఖాన్ మాట్లాడుతూ దాతల సాయంతో సమకూరిన ఆస్తులను లాక్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు దానితో చేతులు కలిపిన పార్టీలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. అల్లా ఆస్తులను అల్లాయే కాపాడుకుంటారని స్పష్టం చేశారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బిల్లు వెనక్కు తీసుకునే వరకు పోరాడతామని వారు హెచ్చరించారు.
ర్యాలీ గుడివాడ రోడ్డులోని జామియా మసీదు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జరి గింది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. దారుల్‌బీర్ మదరసాకు చెందిన విద్యార్థినిలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు.
దుర్గమ్మకు 110 గ్రాముల బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రూ.10 లక్షల విలువైన 110 గ్రాముల బంగారు హారాన్ని భక్తులు శుక్రవారం కానుకగా సమర్పించారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన దేవినేని సురేంద్ర కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్‌ను కలిసి బంగారు హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వారు మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మనసారా కొలిచారు. మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను బహూకరించారు.
నంది వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రి పై నిర్వహిస్తున్న చైత్ర మాస బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజైన శుక్రవారం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు నంది వాహనంపై నగరోత్సవ సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం దిగువన నంది వాహనాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, శ్రీ గంగా పార్వతి (దుర్గ) సమేతంగా మల్లేశ్వర స్వామి వారు అధిష్టించారు. ఆది దంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నగరోత్సవ సేవను లాంఛనంగా ప్రారంభించారు.
భక్తజనం ఆదిదంపతులకు జేజేలు పలికారు. స్వామివారు, అమ్మవార్లను మనసారా కొలిచారు. మహామండపం నుంచి ప్రారంభమైన నంది వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్ మీదగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిన్నారులు, మహిళల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల నడుమ ఊరేగింపు కనుల పండువ గా సాగింది. నగరోత్సవ సేవలో ఆలయ ఏఈవో దుర్గారావు, ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.


