గుడివాడరూరల్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ చేపల మేత గోడౌన్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఏలూరురోడ్డులో ఉన్న చేపల మేత గోడౌన్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటర్‌లో నుంచి మంటలు చెలరేగి గోడౌన్‌కు వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై ఇరుగుపొరుగు ఇళ్ల నుంచి మోటార్ పైపులైన్ల ద్వారా మంటలు పెరగకుండా నియంత్రించారు. స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదంలో గోడౌన్‌లో, సమీపంలోని ఇంట్లో రెండు ఏసీలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. గోడౌన్ లోపలికి మంటలు వ్యాపించి ఉంటే అక్కడ నిల్వ ఉంచిన కెమెకల్స్ ద్వారా పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.
నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి
గుణదల(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదలలోని రామ్స్ థియేటర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. మల్లేశం, మెట్రో వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో 23 పేరుతో చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. విభిన్నమైన పాత్రలతో కథనం నడుస్తుందని చెప్పారు.
దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. 1990 దశకంలో చిలకలూరి పేట ప్రాంతంలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆలోచింప చేసే విధంగా ఉంటాయని తెలిపారు. కథాంశంలోని బస్సు ప్రమాదంలో సుమారు 20–23 మధ్య వయసు గల యువకులు మరణించారని అందుకే ఈ చిత్రానికి 23 అనే పేరు పెట్టామన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ తన్మయ పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం


