
కడసారి చూపునకు వస్తూ...
యడ్లపాడు: నాయనమ్మ మరణించిందని తెలిసి కడసారి చూపునకు వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట పోలిరెడ్డిపాలెం ఎదురుగా ఉన్న లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన మక్కెన శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన శివరామకృష్ణ(28)కి ఏడాదిన్నరక్రితం సమీప బంధువు నందినితో పెళ్లయింది. శివరామకృష్ణ విజయవాడలోనే ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట రూరల్ మండలం అప్పాపురంలో ఉన్న నాయనమ్మ సుబ్బలమ్మ చనిపోయిందన్న వార్త తెలిసి చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. యడ్లపాడు గ్రామంలోని ఎన్‌ఎస్‌ఎల్ నూలుమిల్లు వద్ద ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు శివరామకృష్ణను విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బులమ్మ భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులు సోమవారం ఉదయం ఆమెకు అప్పాపురం గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. శివరామకృష్ణ భౌతికకాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నానమ్మ మరణ వార్త విని వస్తుండగా దుర్ఘటన