అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పది నెలల పాలనలోనే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొ న్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల పదవీ బాధ్యతల స్వీకారోత్సవం శనివారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఎప్పుడు మంచి చేయా లని ఆలోచన చేసే వారన్నారు. వైద్య రంగాన్ని మెరుగు పరిచి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని, ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు.
వ్యతిరేకతను
ప్రజల్లోకి తీసుకెళ్దాం..
కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దామని కార్యకర్తలు, నాయకులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలచి గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు మేలు చేసేందుకు అందించిన సంక్షేమ పథకాలను సైతం కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. నిత్యం వైఎస్సార్ సీపీపై అసత్య ప్రచారాలు చేస్తూ, తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. సంపద సృష్టి పేరుతో అందరినీ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యకర్తలకు పెద్దపీట..
రాబోయే రోజుల్లో కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ పెద్దపీట వేస్తుందన్నారు. కార్యకర్తలందరూ క్రమ శిక్షణతో పనిచేయాలని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రుహుల్లా, జగ్గయ్యపేట పార్టీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, డెప్యూటీ మేయర్‌లు అవుతు శ్రీశైలజరెడ్డి, బెల్లం దుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమం లేదు.. అంతా క్షామమే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం రాజ్యసభ సభ్యుడు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి
అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి


