
కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గోశాల రోడ్డు
అభివృద్ధి పనులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా మండపం నుంచి కనకదుర్గనగర్ వరకు ఉన్న గోశాల రోడ్డు అభివృద్ధి పనులకు ఆదివారం దుర్గగుడి ఈవో కె.రామచంద్రమోహన్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం ఎదుట ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు చేసిన తర్వాత పనులను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ వైకుంఠరావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్‌లో
షణ్ముఖ్ సత్తా
విజయవాడస్పోర్ట్స్: కేంద్రీయ విద్యాలయం రీజనల్ అంతరాష్ట్ర టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజయవాడ క్రీడాకారుడు ఆర్.షణ్ముఖ్ సత్తా చాటాడు. ప్రకాశం జిల్లా రాజంపల్లిలో ఇటీవల జరిగిన పోటీల్లో అండర్–17 బాలుర విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 39 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తలపడ్డారు. నగరంలోని మధురానగర్ కేంద్రీయ విద్యాలయం–1లో షణ్ముఖ్ పదో తరగతి చదువుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో బంగారు పతకం సాధించిన షణ్ముఖ్‌ను, అతనికి శిక్షణ ఇచ్చిన కోచ్ షేక్ గౌస్‌బాషా, షేక్ అబ్దుల్‌ను ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.విశ్వనాథ్, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్ అభినందించారు.
సాఫ్ట్‌బాల్ విజేత
ఏజీ అండ్ ఎస్‌జీ జట్టు
పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏజీ అండ్ ఎస్‌జీ కాలేజీ విజేతగా నిలిచింది. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఆదివారం కృష్ణా యూనివర్సిటీ ఇంటర్‌కాలేజీ సాఫ్ట్‌బాల్ పోటీలు జరిగాయి. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్‌జీ కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో గుడివాడ ఏఎన్‌ఆర్ కాలేజీ, తృతీయ స్థానంలో ఆంధ్ర లయోల కాలేజీ, నాలుగో స్థానంలో ఎస్‌ఆర్‌ఆర్ ఆండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ నిలిచాయి. విజేత జట్టుకు రెక్టర్ ప్రొఫెసర్ మండల బసవేశ్వరరావు, టీడీపీ నేత అనుమోలు ప్రభాకరరావు బహుమతీ ప్రదానం చేశారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ భూలక్ష్మి, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఆర్.రఘురామ్, చంద్రబాబు పాల్గొన్నారు.

కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి

కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి

కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి