ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. యువకుడి దుర్మరణం
గుడివాడరూరల్: ఆగి ఉన్న లారీని మోటారు బైకు ఢీ కొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మల్లాయపాలెంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన తాడంకి రాకేష్(19) గ్రామానికి చెందిన అతని స్నేహితుడు వరుణ్‌తేజ్‌తో కలిసి చర్చిలో ఈస్టర్ ప్రార్థనల్లో పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా మల్లాయపాలెం సమీపంలోని శ్యామలాంబ రైస్‌మిల్లు సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులు వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలకు గురైన వరుణ్‌తేజ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. మృతుడి తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ తాలూకా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం రాకేష్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంతో చౌటపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చర్చిలో ప్రార్థనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని మృతుడు రాకేష్ స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్న వయసులోనే రాకేష్ మృతి చెందడం పట్ల స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు


