వైద్యసేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ
మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది హాజరు, వైద్య సేవల నాణ్యతను నిర్ధారించేందుకు ఆకస్మిక తనిఖీలు, వాట్సాప్ వీడియో కాల్స్ నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ తెలిపారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా పనితీరు మ్యాట్రిక్స్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై జిల్లా స్థాయి జూమ్ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం, పనితీరులో లోపాలు, సూచనలను పాటించకపోవడం లాంటి అంశాలను గుర్తిస్తే తీవ్రమైన చర్యలు తప్పవన్నారు. ప్రతి సూచికలో గణనీయమైన అభివృద్ధి సాధించాలంటే వ్యూహాత్మక చర్యలు, క్రమబద్ధమైన పనితీరు, బాధ్యతాయుతమైన విధానాలు అవసరమన్నారు. రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానాన్ని సాధించేందుకు నిరంతర పర్యవేక్షణ, సమర్థమైన ప్రణాళిక, కార్యసాధనపై దష్టి పెట్టాలని సూచించారు. ఫీల్డ్ రిపోర్టింగ్ సిస్టమ్ పూర్తిగా అనుసరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సంస్థల వద్ద ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజా ఆరోగ్య కార్యక్రమాలను నిర్ణీత గడువుల్లో అమలు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.


