
ప్రజలకు అందుబాటులో ఉంటా
కర్నూలు: ‘ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతా. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరి గే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా’ అని జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఇక్కడున్న బిందుమాధవ్ కాకినాడకు, అక్కడున్న విక్రాంత్ పాటిల్ కర్నూలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో 55వ ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీపీఓ చేరుకోగానే పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పౌరోహితుల ఆశీస్సులు అందుకున్నారు. 2012 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ తమిళనాడు రాష్ట్రం కేడర్‌కు ఎంపికై న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశంలో నూతన ఎస్పీ పాల్గొని విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను వివరించారు. ఆయన మాటల్లోనే..‘సైబర్ నేరాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. వాటి నివారణకు గట్టి చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరాలను ఛేదించడం, కట్టడితో పాటు వాటి నివారణకు అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా విస్తృతం చేస్తాం. సైబర్ మోసాలపై వీడియో క్లిప్పింగులను కళాశాల, పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసు లు, మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తాం. సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో సీఎస్‌ఆర్ నిధులతో సీసీ కెమెరాల నిఘాను పెంచుతాం. నేరాల నివారణకు జిల్లా పోలీసు శాఖకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలి’అని విజ్ఞప్తి చేశారు. సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగ ప్రస్థానం...
ఎస్పీ విక్రాంత్ పాటిల్ 2016లో తుల్లూరులో ఏఎస్పీగా, 2017లో పార్వతీపురం ఓఎస్‌డీగా పనిచేసి ఎస్పీగా పదోన్నతి పొందారు. 2018లో చిత్తూరు జిల్లా ఎస్పీగా, 2019లో విశాఖపట్నం డీసీపీగా, గుంతకల్లు రైల్వే ఎస్పీగా, విజయవాడ డీసీపీగా, 2021లో విజయనగరం 5వ ఏపీఎస్పీ బెటాలియన్, 2023లో పార్వతీపురం మన్యం ఎస్పీగా పనిచేశారు. 2024 ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ కాకినాడ కమాండెంట్‌గా, ఆ తర్వాత కాకినాడ ఎస్పీగా పనిచేసి బదిలీపై కర్నూలుకు వచ్చారు.
జిల్లా నూతన ఎస్పీ విక్రాంత్ పాటిల్
Comments
Please login to add a commentAdd a comment