అంతర్గత బదిలీలకు తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

అంతర్గత బదిలీలకు తిలోదకాలు

Mar 18 2025 8:48 AM | Updated on Mar 18 2025 8:45 AM

శ్రీశైల దేవస్థానంలో అంతర్గత బదిలీలకు అధికారులు తిలోదకాలిచ్చారు. మూడు నెలలకోసారి అంతర్గత బదిలీలు చేయాలనే దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలను గాలికొదిలేశారు. ఫలితంగా కొందరు ఫెవికాల్‌ వీరులు దాదాపు తొమ్మిది నెలలుగా కొన్ని విభాగాల్లో తిష్టవేశారు.

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు రాష్ట్ర దేవదాయశాఖ సుమారు 300 మంది రెగ్యులర్‌ సిబ్బందిని, 1000 మందికి పైగా కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఇతర ఉద్యోగులను నియమించింది. దేవస్థానంలో విధులు నిర్వహించే రెగ్యులర్‌ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి ఇతర దేవస్థానాలకు బదిలీ చేస్తారు. ఇక పరిపాలన సౌలభ్యం కోసం, ప్రతి అధికారికి, సిబ్బందికి పాలనలో అనుభవం కోసం ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్‌ పద్ధతిన అంతర్గత బదిలీలు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకుండా అధికారులు తమకు నచ్చిన సమయంలో ఇష్టానుసారంగా అంతర్గత బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈఓల మాట వినని అధికారులు, సిబ్బందిపై కక్ష తీర్చుకునేందుకు మాత్రమే కమిషనర్‌ ఆదేశాలు ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

కూటమి ప్రభుత్వం రాగానే..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జూలై 8న పర్యవేక్షకులు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, పలువురు అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో పాటు పరిచారకులను ఒకేసారి 52 మందిని బదిలీ చేశారు. మరికొన్ని రోజులకు ఏఈఓ, పర్యవేక్షకులను సైతం అంతర్గత బదిలీలు చేస్తూ ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది నెలలవుతున్నా అంతర్గత బదిలీల ఊసే లేదు. దీంతో వసతి విభాగంలో కొందరు పాతుకుపోయారనే విమర్శలున్నాయి. ఈ విభాగంలోని వారు ప్రొటోకాల్‌ వ్యవహారాలు, సిఫార్స్‌ లేఖలకు వసతి గదులు, దర్శనం టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాధాన్యత ఉన్న విభాగం కాబట్టి ఇక్కడి నుంచి కొందరు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. మల్లికార్జున సదన్‌ కౌంటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగి రెండేళ్లకు పైగా అక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ప్రమోషన్లు ఇచ్చి..పోస్టింగులు మరిచి!

దేవస్థానంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి సహాయ కార్యనిర్వహణాధికారులుగా, సీనియర్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి పర్యవేక్షకులుగా గత ఏడాది డిసెంబరు 27న ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇంతవరకు పోస్టింగులు ఇవ్వలేదు. గత మూడు నెలలుగా వారు గతంలో వారికి కేటాయించిన సీటులోనే విధులు నిర్వహిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

అంతర్గత బదిలీలు పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టే అంశం. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన అంశం. నేను ఈఓగా వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతుంది. అప్పటి నుంచి సంక్రాంతి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపైనే ప్రత్యేక దృష్టి సారించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవరెవరు ఎన్ని నెలలుగా ఒకే సీటులో ఉంటున్నారనే విషయంపై పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. – ఎం.శ్రీనివాసరావు,

శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

మూడు నెలలకోసారి బదిలీలు

చేయాలని కమిషనర్‌ ఆదేశాలు

పట్టించుకోని శ్రీశైలం దేవస్థానం

అధికారులు

అంతర్గత బదిలీలకు తిలోదకాలు1
1/1

అంతర్గత బదిలీలకు తిలోదకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement