కర్నూలు(సెంట్రల్): రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం విమర్శించారు. బుధవారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఏపీ రైతుసంఘం జిల్లా కార్యవర్గ సమావేవంలో వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని మోసం చేశాయన్నారు. అన్నదాతలు పంటలు పండక అప్పులు పాలయ్యారని, అయినా బీమాను వర్తింపజేయడంలేదన్నారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4న కర్నూలులో నిర్వహించనున్న జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని, అందులో రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పాల్గొన్నారు.


