భృంగివాహనంపై మల్లన్న | - | Sakshi
Sakshi News home page

భృంగివాహనంపై మల్లన్న

Mar 28 2025 1:59 AM | Updated on Mar 28 2025 1:57 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31 వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. శ్రీశైల భ్రామరి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగాణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు. లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సందర్భంగా చండీశ్వరునికి ప్రత్యేకంగా పూజాదికాలు నిర్వహించారు, అనంతరం కంకణాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారులు, అర్చకస్వాములు ధరించారు. రుత్వికులకు దీక్షావస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన పూజలను జరిపించారు. అనంతరం ఉగాది మహోత్సవాలకు అంకురార్పణ చేశారు.

మహాలక్ష్మీ అలంకారంలో భ్రామరి

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి మహాలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్బుజాలు కలిగిన దేవి పై రెండు చేతులలో పద్మాలను, కింది చేతులలో కుడివైపున అభయహస్తం, ఎడమవైపున వరముద్రతో దర్శనం ఇచ్చారు. మహాలక్ష్మీ స్వరూపాన్ని దర్శించడం వల్ల శత్రుబాధలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

కనుల పండువగా భృంగివాహన సేవ

ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి భృంగివాహనసేవ నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై ఆశీనులను చేసి అలంకార మండపంలో పూజాదికాలు నిర్వహించారు. భృంగీవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలను హరించబడుతాయని భక్తుల విశ్వాసం. అనంతరం ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీశైలంలో నేడు

ఉత్సవాల్లో రెండవ రోజు శుక్రవారం భ్రమరాంబాదేవికి మహాదుర్గ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి కైలాసవాహనసేవ నిర్వహించనున్నారు. గ్రామోత్సవం నిర్వహిస్తారు.

శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు

ఐదు రోజుల పాటు నిర్వహణ

మహాలక్ష్మీ అలంకారంలో

శ్రీశైల భ్రామరి

శ్రీగిరి క్షేత్రానికి పోటెత్తిన కన్నడ భక్తులు

భృంగివాహనంపై మల్లన్న 1
1/1

భృంగివాహనంపై మల్లన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement