ఆడపడుచుకు అగ్రాసనం
శ్రీశైలంటెంపుల్: కన్నడిగుల భక్తి భావంతో శ్రీగిరి క్షేత్రం పరవశించిపోతుంది. వందల కి.మీ పాదయాత్రగా చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించిపోతున్నారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ప్రత్యేకంగా తమ ఇంటి నుంచే సారెను తీసుకువస్తారు. ఈ సారెలో బియ్యం, బెల్లం, శనగబ్యాళ్లు, గోధుమపిండి, కొబ్బరిగిన్నె, పూలు, రవిక, చీర, తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని తీసుకువచ్చి ఐదు రోజుల పాటు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఈ సారెను అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే మల్లికార్జున స్వామి స్వరూపంగా భావించే కంబికి (పల్లకీ) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాదయాత్రగా తరలివచ్చే భక్తులు ఈ కంబిని తమ సొంత గ్రామాల నుంచి భుజాన మోసుకుంటూ వస్తారు. ఈ కంబికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు పూజలు నిర్వహిస్తారు. శ్రీశైలం నుంచి తిరిగివెళ్లే సమయంలో భక్తులు తమ తోబుట్టువులు, ముత్తైదువుల కోసం ప్రత్యేక వాయనం తీసుకెళ్తారు. చీర, జాకెట్, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, బెల్లం, విభూది, వివిధ రకాల పండ్లతో వాయనం తీసుకెళ్తారు. ఈ వాయనానికి తమ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తమ వారికి నూతన చాటల్లో అందిస్తారు. ఈ చాటలను కూడా శ్రీశైలం నుంచి తీసుకెళ్తారు. దీంతో శ్రీశైలంలో చాటల వ్యాపారం బాగా జరుగుతోంది. శ్రీశైలంలో ఎక్కడ చూసినా చాటల విక్రయాలే కనబడుతున్నాయి. కన్నడిగులు అధికసంఖ్యలో చాటలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే అమ్మవారి గుర్తుగా బొమ్మను కొనుగోలు చేస్తారు.
శ్రీశైల భ్రమరాంబాకు కన్నడిగుల సారె
తిరుగు ప్రయాణంలో తోబుట్టువులకు వాయనంతో స్వగ్రామానికి
శ్రీశైలంలో చాటలకు పెరిగిన డిమాండ్
ఆడపడుచుకు అగ్రాసనం


