కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గతేడాదిలో జరిగిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. ఉమ ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలు https:// rayalseemauniversity. ac. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
టీబీ డ్యాం నుంచి
రోజుకు 5 వేల క్యూసెక్కులు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని పశ్చిమ ప్రాంత ప్రజలతో పాటు కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఆదివారం నుంచి తుంగభద్ర డ్యాం నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజినీరు ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ప్రవాహం ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల ప్రకారం మొత్తం 2 టీఎంసీల నీటిని టీబీ డ్యాం నుంచి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నదితీర ప్రాంతాల్లోని ఎస్‌ఎస్ ట్యాంకులను నింపుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజినీరు బీ నాగేశ్వరరావు క్షేత్ర స్థాయి అధికారులను కోరారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎల్‌ఎల్‌సీకి నీటి విడుదల ఉన్న నేపథ్యంలో ఆయా ఎస్‌ఎస్ ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిన సందర్భాల్లో ఎప్పటికప్పుడు నింపుకోవాలన్నారు. టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదికి నీరు విడుదల చేయడంతో ప్రస్తుత వేసవిలో నది తీర ప్రాంతాల్లోని ప్రజలకు, ముఖ్యంగా రైతులకు సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడనున్నాయి.
నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యయప్రయాసలతో ప్రజలు జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.
ఉపాధికూలీల వేతనం రూ.307కు పెంపు
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులకు హాజరయ్యే కూలీలకు చెల్లిస్తున్న వేతనాలను కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజు వారీగా చెల్లిస్తున్న గరిష్ట వేతనం రూ.300 ఉంది. దీనిని రూ.307 పెంచుతూ.. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకు కేవలం రూ.7 మాత్రమే పెంచింది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉపాధి కూలీల వేతనాలు తక్కువగా ఉన్నాయి. 2024 మార్చిలో ఉపాధి కూలీల గరిష్ట వేతనం రూ.272 ఉంది. ఈ మొత్తాన్ని అప్పుడు రూ.300కు పెంచింది. అంటే రోజుకు రూ.28 పెంచింది. ఇప్పుడు నామమాత్రంగా కేవలం రూ.7 మాత్రమే పెంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు గరిష్ట వేతనం రూ.300 ఉన్నా... టీడీపీ అనుకూల ఫీల్డ్ అసిస్టెంట్లు టీడీపీ సానుభూతి పరుకులకు మాత్రమే గరిష్ట వేతనం లభించే విధంగా కొలతలు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతరులకు రూ.100 నుంచి రూ.150 వరకు మాత్రమే లభిస్తోంది.
రిజిస్ట్రేషన్లకు స్పందన నిల్
కర్నూలు (సెంట్రల్): ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో పండుగ సెలవులు ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆదివారం ఉగాది పండుగ అయినా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే క్రయవిక్రయదారుల నుంచి స్పందన కనిపించ లేదు. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కేవలం 60 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. వాటిలో కూడా కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు బలవంతంగా డాక్యుమెంట్ రైటర్లకు ఫోన్లు చేసి రిజిస్ట్రేషన్లు పెట్టించారు. అయితే పండుగ రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సోమవారం రంజాన్ పండుగ నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ఉన్నా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మాత్రం తెరుచుకునేలా ఆదేశాలు ఉన్నాయి. దీంతో సోమవారం రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని, ప్రజలు స్పందించి క్రయవిక్రయాలకు డాక్యుమెంట్లను రాయించుకోవాలని అధికారులను సూచించారు.


