ప్రేమను గెలిపించే పిడకల సమరం
ఆస్పరి: శ్రీ వీరభద్రస్వామి, కాళికాదేవి మధ్య ప్రేమ వివాహం విజయం కావడం.. ఇందుకు పిడకల సమరం దోహదపడటంతో ప్రతి ఏటా కై రుప్పల గ్రామంలో పెద్ద నుగ్గులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం వేడుకను నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత శ్రీ వీరభద్రస్వామి, కాళికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం సర్పంచ్ తిమ్మక్క, ఆలయ కార్యనిర్వహణ అధికారి రాంప్రసాద్, గ్రామపెద్దల ఆధ్వర్యంలో వేలాది మంది జనం మధ్య పిడకల సమరం (పెద్ద నుగ్గులాట) జరగనుంది. పిడకల సమరాన్ని చూడడానికి కర్నూలు జిల్లాప్రజలేకాకుండా కర్ణాటక, తెలంగాణ తదిత ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కై రుప్పలలో పిడకల సమరం జరగడం ప్రత్యేకతగా నిలిచింది.
చారిత్రక నేపథ్యమిదీ..
పిడకల సమరానికి చారిత్రక నేపథ్యం ఉందని స్వామి భక్తులు తెలిపారు. విహార యాత్రకు వెళ్లిన వీరభద్రస్వామి తనకు తారాస పడిన కాళికాదేవితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటున్నానని మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత స్వామి ఇచ్చిన మాట తప్పడంతో కాళికాదేవి వర్గీయులకు తీవ్ర ఆగ్రహంతో పిడకలతో స్వామి వర్గీయులపై దాడికి దిగిరాట. స్వామి వర్గీయులు కూడా పిడకలతో ఎదురు దాడికి దిగారాట. సమరాన్ని ఆపించి పెద్దలు పంచాయితీ చేసి వీరభద్రస్వామి, కాళికాదేవి వివాహం చేశారని పెద్దలు చెబుతున్నారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమ వ్యవహారం కారణంగా భక్తులు పిడకల సమరం చేసుకోవడం ఆచారంగా వస్తోంది.
సమరం సాగుతుంది ఇలా..
పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి గ్రామాల ప్రజలు తమ కోరికలను తీర్చిన వీరభద్రుడికి మొక్కుబడి సమర్పించేందుకు ఒక నెల నుంచే పశువుల పేడతో పిడకలు తయారు చేస్తారు. వాటిని ఉగాది మరుసటి రోజు దేవుడి సన్నిధికి చేరుస్తారు. పిడకల సమరానికి ముందు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. దెబ్బలు తగలకుండా టవాళ్లతో ముసుగు తొడుక్కుంటారు. అరగంట పాటు జరిగే పిడకల సమరంలో చాలా మంది భక్తులు గాయపడుతారు. గాయానికి స్వామివారి బండారం రాసుకుని ఇంటి ముఖం పడతారు.
‘కారుమంచి’ ఆచారం
కారుమంచి గ్రామానికి చెందిన పెద్దరెడ్డి వంశస్థుల్లో ఒకరు పిడకల సమరం రోజు శిరస్సున కిరీటం ధరించి, ఖడ్గం చేత పట్టుకుని అశ్వంపై కై రుప్పల గ్రామానికి తన అనుచరులతో వస్తారు. అనంతరం వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కారుమంచి వైపు వెళ్తారు. తర్వాత పిడకల సమరం మొదలవుతుంది. ఆలయ అభివృద్ధిలో పెద్దరెడ్డి వంశస్థులు కీలక పాత్ర పోషించారు. ఆ కుటుంబానికి స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు.
నేడు కై రుప్పలలో నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి చేసిన గ్రామస్తులు
ప్రేమను గెలిపించే పిడకల సమరం


