రైతు ఆత్మహత్యలకు ఎన్‌డీఏ సర్కారే కారణం
కర్నూలు(సెంట్రల్): దేశంలో రైతు ఆత్మహత్యలకు ఎన్‌డీఏ సర్కార్ విధానాలే కారణమని కేరళ వ్యవసాయ శాఖమంత్రి ప్రసాదు అన్నారు. శుక్రవారం కర్నూలులోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య అధ్యక్షతన జాతీయ రైతు సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కేరళ వ్యవసాయ శాఖమంత్రితో పాటు ఏపీ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాదు మాట్లాడుతూ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దొడ్డిదారిలో రైతు వ్యతిరేక చట్టాల అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేరళ భూసంస్కరణల్లో సీపీఐ కీలకపాత్ర పోషించిందని, మార్కెటింగ్ విధానంతో రైతులకు కేరళ ప్రభుత్వ అండగా ఉందని చెప్పారు.
● మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఏపీలో రైతుల స్థితిగతులు అగమ్యగోచరంగా ఉన్నాయన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం అన్యాయమన్నారు.
● ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం మాట్లాడుతూ ఏపీలో అమల్లో ఉన్న ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తోందని విమర్శించారు. ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.
● సమావేశంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.


