‘ఈ–శ్రమ్’తో అసంఘటిత కార్మికుల గుర్తింపు
కర్నూలు(అర్బన్): అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పేర్లను ఈ– శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించాలని ఏపీ ప్రభుత్వ కర్మాగార, బాయిలర్స్, బీమా, మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన కార్మిక శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, సహాయ కార్మిక శాఖ అధికారులు, ఫ్యాక్టరీల యజమానులు, సీఐటీయు, ఏఐటీయుసీ కార్మిక సంఘాల నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ ఏదైనా సంస్థలో పది కంటే ఎక్కువ మంది కార్మికులు పని చేస్తుంటే, వారి నెల జీతం రూ.21 వేల లోపు ఉంటే ఈఎస్‌ఐ చట్టం కింద పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కార్మిక, కర్మాగారాల, బీమా, మెడికల్ సర్వీసెస్ శాఖల సమన్వయంతో అర్హత ఉన్న కార్మికుల పేర్లను రాబోవు రెండు నెలల్లో పేర్లను నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తుంటే వారికి చట్ట ప్రకారం రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో పనిచేసే మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి కర్మాగారాలను గుర్తించి మరుగుదొడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ యం బాలునాయక్, విజయవాడ సంయుక్త కమిషనర్లు ఎస్ లక్ష్మినారాయణ, ఏ గణేషన్, సహాయ కార్మిక కమిషనర్ ఆదినారాయణ, ఉమ్మడి నాలుగు జిల్లాల ఉప కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
కార్మికుల పేర్లను నమోదు చేయాలి
ఏపీ ప్రభుత్వ కార్మిక శాఖ అదనపు
కార్యదర్శి గంధం చంద్రుడు
‘ఈ–శ్రమ్’తో అసంఘటిత కార్మికుల గుర్తింపు


