అకాల వర్షం.. అపార నష్టం
కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (అర్బన్): పొలంలో చేతికొచ్చిన పంటలు నీటమునిగాయి. కల్లాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కాయలతో కళకళలాడుతూ ఉండే అరటి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. పసుపు పంట పూర్తిగా పనికిరాకుండా పోయింది. అకాల వర్షంతో రైతుల రెక్కల కష్టం నేలపాలైంది. అన్నదాతల్లో ధైర్యం తొలగి దైన్యమే మిగిలింది. గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైన అకాల వర్షాల ప్రభావం శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కురిసిన అకాల వర్షాలతో మిర్చి, ఉల్లి, అరటి, వరి, మినుము పంటలకు అపార నష్టం వాటిల్లింది.
ఏ పంటలు ఎలా దెబ్బతిన్నాయంటే..
● కర్నూలు జిల్లాలో కోడుమూరు, సి.బెళగల్, గోనెగండ్ల, చిప్పగిరి మంత్రాలయం తదితర ప్రాంతాల్లో మిర్చి చివరి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో రైతులు మిర్చిని పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. ఊహించని విధంగా వర్షాలు పడటంతో మిర్చి పంట పూర్తిగా తడిచిపోయింది.
● ఇటీవలి వరకు ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో లేట్ రబీలో ఈ పంట ఎక్కువగా సాగు చేశారు. కోసి ఆరబెట్టిన ఉల్లిని వర్షాలు తడిపేశాయి.
● గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎమ్మిగనూరు మండలంలో అరటి భారీగా నేల కూలింది. అయితే ఉద్యాన అధికారులు 5 హెక్టార్లలోనే అరటి దెబ్బతిన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
● సి.బెళగల్ మండలంలో మునగ, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. అయితే అధికారులు మాత్రం మునగ ఒక హెక్టారు, కూరగాయల పంటలు ఒక హెక్టారులో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వ్యవసాయ పంటలకు ఎటువంటి నష్టం లేదని ప్రకటించారు.
● నంద్యాల జిల్లాలో రబీ సీజన్‌లో వరి ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం పాల కంకి దశలో ఉంది. బండిఆత్మకూరు, గడివేముల, మహానంది, వెలుగోడు మండలాల్లో 5 వేల హెక్టార్లలో వరి దెబ్బతినింది. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం 2,158 హెక్టార్లు అని గుర్తించారు. అలాగే మినుము 10 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు.
● నంద్యాల జిల్లాలో అరటి కూడా భారీగా దెబ్బతినింది. సంజామల మండలంలోని నొస్సం, గిద్దలూరు, రామభద్రునిపల్లి గ్రామాల్లో అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు, గాలి తీవ్రతకు అరటి తోటలు నేల కూలాయి. ఉద్యాన అధికారులు 16.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో మామిడి ఈ సారి నిరాశాజనకంగా ఉంది. అంతంతమాత్రం ఉన్న కాపు గాలుల తీవ్రత, వర్షాలుకు నేల రాలిపోయింది. బేతంచెర్ల, ఓర్వకల్లు, ప్యాపిలి, డోన్, గోనెగండ్ల, సి.బెళగల్ తదితర మండలాల్లో పెనుగాలులకు మామిడి చెట్లు, కాయలు నేల రాలాయి. అయినా ఉద్యానశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
5 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి
అధికార అంచనా 2,158 హెక్టార్లు
మాత్రమే
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో
నేలకొరిగిన అరటి తోటలు
పాడైపోయిన మిర్చి, ఉల్లి పంటలు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం
అందేనా?
వర్షపాతం వివరాలు (మి.మీ)..
మండలం వర్షపాతం
వెలుగోడు 56.8
కోడుమూరు 46.4
నందికొట్కూరు 46.2,
సి.బెళగల్ 37.8
బండిఆత్మకూరు 37.0
సంజామల 30.6
మిడుతూరు 26.4
మహానంది 25.2
కొలిమిగుండ్ల 24.2
గోనెగండ్ల 24.2
కర్నూలు అర్బన్ 23.6
చిప్పగిరి 22.8
ప్యాపిలి 22.4
అకాల వర్షం.. అపార నష్టం
అకాల వర్షం.. అపార నష్టం


