స్వర్ణ రథోత్సవం.. దేదీప్యమానం
శ్రీశైలంటెంపుల్: రుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం దేదీప్యమానంగా నిర్వహించారు. హర..హర.. మహాదేవ, ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ నీరాజనాలు సమర్పించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణ రథంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి విశేషపూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి నంది మండపం వరకు మాడవీధుల్లో రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో కోలాటం, చెక్కభజన.. తదితర జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పండితులు, అర్చకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దేశ భక్తిని పెంచే
రాష్ట్ర సేవికా సమితి
కర్నూలు (సెంట్రల్): దేశ భక్తిని రాష్ట్ర సేవికా సమితి పెంపొందిస్తుందని సమితి ప్రాంత సహ కార్యవాహిక ఉజ్వల అన్నారు. రాష్ట్ర సేవికా సమితి ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ సంఘం సభ్యులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య వక్తగా సమితి ప్రాంత సహ కార్యవాహిక ఉజ్వల మాట్లాడుతూ.. 90 సంవత్సరాలుగా మహిళలను చైతన్యం చేస్తూ రామాయణం, భాగవతాలను వివరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్వర్ణలత, అన్నయ్య, వసంతలక్ష్మి పాల్గొన్నారు.
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): వేసవి ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత నేటి నుంచి పెరుగనున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఉమ్మడి జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. శనివారం కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు పెరిగాయి. కోసిగి, కర్నూలు అర్బన్, కోడుమూరు, దొర్నిపాడు, గడివేముల, కొత్తపల్లిలలో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రకటించింది. ఉపాధి పనులకు వెళ్లే కూలీలు, రైతులు, ఇతరులు వడగాల్పుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రం వేళల్లో అకాల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
స్వర్ణ రథోత్సవం.. దేదీప్యమానం


