ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
కర్నూలు (టౌన్): ఇంట్లో అందరూ ఉన్నారు.. తలుపు గడియ కూడా పెట్టుకున్నారు.. అయినా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. రూ. 5.5 లక్షల నగదు, 8 తులాల బంగారు అపహరణ చేశారని ఉపాధ్యాయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలులోని ధనలక్ష్మీనగర్ నివసించే కడబూరు చంద్రశేఖర్ రెడ్డి కల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో ఇంటికి ఉన్న ప్రధాన ధ్వారం (మెయిన్ డోర్ ) పక్కన ఉన్న కిటీకీ అద్దాలు పగల కొట్టి ఒక దొంగ.. ఇంట్లోకి ప్రవేశించాడు. బెడ్‌రూమ్‌లో డ్రస్సింగ్ టేబుల్ వద్ద ఉన్న తాళాలు బీరువా తెరచి.. అందులో ఉన్న రూ.5.50 లక్షల నగదు, 8 తులాల బంగారం తీసుకొని ఉడాయించారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయుడు.. కర్నూలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగిన ఇంటిని సీఐ శేషయ్య పరిశీలించారు. వేలి ముద్రలు సేకరించారు. పక్క ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఒక దొంగ చోరీ చేసినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రూ. 5.5 లక్షల నగదు,
8 తులాల బంగారు అపహరణ


