హైకోర్టు ఆదేశించినా బేఖాతరు
కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం మార్కాపురం, తడకనపల్లె డీలర్లు మద్దిలేటి, సత్యనారాయణమ్మను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోమవారం జేసీ డాక్టర్ బి.నవ్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లను తొలగించి టీడీపీ అనుకూల వ్యక్తులకు ఇన్‌చార్జ్ ఇప్పించుకొని వారి ఇళ్ల దగ్గరే చౌక సరుకులను వేస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్లినట్లు వివరించారు. ఇదిలాఉండగా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ డాక్టర్ బి.నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. నిర్ధేశిత సమయంలోపు అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో 104 వినతులు రీఓపెన్ అయినట్లు చెప్పారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని


