జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

Apr 9 2025 1:00 AM | Updated on Apr 9 2025 1:00 AM

జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

కర్నూలు కల్చరల్‌: జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. సమీక్షలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జేసీ డాక్టర్‌ బి.నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యా భరద్వాజ్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కర్నూలు జిల్లా తలమానికమన్నారు. కర్నూలు జిల్లా పరిశ్రమల హబ్‌, డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించిన పీ–4లో కూడా జిల్లా ముందంజలో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. రూ.14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

● మంత్రి భరత్‌ మాట్లాడుతూ పారిశ్రామికంగా, నీటిపారుదల ప్రాజెక్టుల పరంగా జిల్లా ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తద్వారా జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి వలసల నివారణకు వీలవుతుందన్నారు.

● ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మిర్చి పంట అధికంగా పండించడం వల్ల నిల్వ చేసుకోవడం కష్టంగా ఉందన్నారు. రైతులు గుంటూరులో స్టోర్‌ చేసుకునేందుకు వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారన్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో అసంపూర్తిగా ఉన్న కోల్డ్‌ స్టోరేజ్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు.

● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ జొన్న దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కేజీబీవీల్లో పది శాతం సీట్లు పెంచాలని, ఆలూరు, చిప్పగిరి మండలాల్లో కొత్తగా మోడల్‌ స్కూళ్ల ఏర్పాటు చేయాలని కోరారు. దేవనకొండ మండలంలో 25 చెరువులకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ నీరు ఇచ్చే విధంగా కాల్వ విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు.

● కలెక్టర్‌ రంజిత్‌ బాషా మాట్లాడుతూ ఇరిగేషన్‌ పరంగా జిల్లాకు కొన్ని ప్రాజెక్టుల అవసరముందన్నారు. వేదవతి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికి రూ.110 కోట్లతో పనులు జరిగాయన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే 80 వేల ఎకరాలకు సాగు నీటిని ఇవ్వగలుగుతామన్నారు.

● జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ జూరాల నుంచి 17 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 300 టీఎంసీల నీళ్లు వచ్చాయని, ఎన్ని నీళ్లు వచ్చినా జిల్లాలో ప్రస్తుతం సాగు, తాగునీటికి ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో అవసరమైన నీటి స్టోరేజీ రిజర్వాయర్లు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు.

● కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ కోడుమూరులో వారానికి, పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని చుట్టూ నీళ్లు ఉన్నా నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దేవమడ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

● ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజయక వర్గ పరిధిలో 16 వార్డులు, కోడుమూరులో 3 వార్డులు కర్నూలు కార్పొరేషన్‌లో విలీనమై చాలా ఏళ్లు అవుతున్నా నీటి సమస్య వేధిస్తుందని, వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

డీఆర్‌సీలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement