కోవెలకుంట్లలో క్షుద్ర పూజల కలకలం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల–నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారిలో కుందూనది ఒడ్డున క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన మంత్ర, తంత్ర పూజల ఆనవాళ్లు బుధవారం బయటపడ్డాయి. ముగ్గుతో మనిషి ఆకారాన్ని వేసి అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసి నల్లకోడిని బలి ఇచ్చి, కోడి తలను హారతిపల్లెంలో పెట్ట పూజలు చేసినట్లు తెలుస్తోంది. క్షుద్రపూజలు జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో రెండు శతాబ్దాల క్రితం కనుమలపాడు గ్రామం ఉండేది. కుందూనది వరదల కారణంగా గ్రామం కనుమరుగైనా ఇప్పటికీ ఆ ప్రాంతంలో గ్రామానికి సంబంధించి కొన్ని ఆనవాళ్లులున్నాయి. పురాతన గ్రామంలో గుప్తనిధులు ఏవైనా ఉండవచ్చనే ఉద్దేశంతో దుండగులు పూజలు చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది.


