రేపటి నుంచి ఫోరెన్సిక్ వైద్యుల రాష్ట్ర సదస్సు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ నెల 12, 13వ తేదీల్లో ఫోరెన్సిక్ అండ్ టాక్సికాలజీ వైద్యుల 6వ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి. సాయిసుధీర్ చెప్పారు. గురువారం ఫోరెన్సిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ ఆధ్వర్యంలో కర్నూలులో మొదటిసారిగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘ఫోరెన్సిక్ ఫిజీషియన్ ఏ క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరసింహం, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 మంది పోలీస్ అధికారులతో పాటు మొత్తం 394 మంది వైద్యులు ఏపీ, తెలంగాణా, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ ఓపీ ప్రారంభిస్తామన్నారు. అత్యవసర కేసులకు(ఎంఎల్‌సీ) కాల్ డ్యూటీ ద్వారా హాజరై డ్యూటీ డాక్టర్‌లకు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. సమావేశంలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి. బ్రహ్మాజీమాస్టర్, వైద్యులు వైకేసీ రంగయ్య, కె.నాగార్జున, వి.కోటేశ్వరరావు, పి. హరీ ష్‌కుమార్, సురేఖ, మహ్మద్ సాహిద్ పాల్గొన్నారు.


