పోలీస్, న్యాయ శాఖలకు ‘ఫోరెన్సిక్’ వారధి
కర్నూలు(హాస్పిటల్): పోలీస్, న్యాయ శాఖలకు ఫోరెన్సిక్ విభాగం వారధి వంటిదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ డీఎస్‌ఎల్‌వీ నరసింహులు అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజిలో ఫోరెన్సిక్ విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల 6వ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ వైద్యుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంఈ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ విభాగంలో మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్‌ను ఓపీ విభాగంలో చేర్చేందుకు ప్రభుత్వానికి నివేదించామని, అనుమతి లభించిన వెంటనే ఓపీ విభాగంలో కూడా సేవలందిస్తామని చెప్పారు. అధునాతన టెక్నాలజీతో కచ్చితమైన ఫలితాలను అందించవచ్చన్నారు. ఎంఎల్‌సీ కేసుల్లో ఫోరెన్సిక్ విభాగం ఇచ్చే నివేదికతో నిందులను గుర్తించవచ్చన్నారు.
● విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. మెడికో లీగల్ కేసుల్లో ఫోరెన్సిక్ విభాగం సేవలు మరువలేనివన్నారు. ఆ విభాగం అందించే నివేదికలతోనే నేర పరిశోధనలో వాస్తవ విషయాలు వెలుగు చూస్తున్నాయన్నారు. నేర పరిశోధనలో ‘రియల్ హీరోస్’ ఫోరెన్సిక్ విభాగ వైద్యులేనని అన్నారు.
● మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఫోరెన్సిక్ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సాంకేతిక సదుపాయాలు కూడా ఫోరెన్సిక్ విభాగానికి తోడ్పాటునందిస్తున్నాయని చెప్పారు.
● కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకి ఫోరెన్సిక్ సబ్జక్టు ఎంతో ఇష్టమని, ఈ సబ్జక్టులో ప్రతి విషయానికి ఒక కథతో అనుసంధానించబడి ఉంటుందన్నారు.
● కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్‌కే. ప్రకాష్, రిటైర్డ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ వీరనాగిరెడ్డి, ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సాయిసుధీర్, ప్రొఫెసర్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కేసీ రంగయ్య, ఏపీఏఎఫ్‌ఎంటీ జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, ప్రాంతీయ కంటి ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సంతృప్తి చెందాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందించే ఆరోగ్యసేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం సిద్ధించినట్లు అవుతుందని డీఎంఈ డాక్టర్ డీఎస్‌ఎల్‌వీ. నరసింహులు చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన కర్నూలు మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో హెచ్‌వోడీలు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. కాలేజీ, హాస్పిటల్ మధ్య సమన్వయం ముఖ్యమని, రోగులకు ఇబ్బంది లేకుండా ఆయా విభాగాలు సర్దుబాటు చేసుకుని సేవలు అందించాలని కోరారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ సీఎస్‌కే. ప్రకాష్ పాల్గొన్నారు.
డీఎంఈ డాక్టర్ నరసింహులు
పోలీస్, న్యాయ శాఖలకు ‘ఫోరెన్సిక్’ వారధి


