వైభవంగా అక్కమహాదేవి జయంతోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లికార్జున స్వామివారి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషే కం, జలాభిషేకం తదితర విశేషపూజలు చేపట్టారు. పూజల్లో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైల మల్లికార్జునుడిలో ఐక్యం కావాలనే సంకల్పంతో అక్కమహాదేవి తన జీవితపు చివరి రోజులను శ్రీశైలంలోనే గడిపారని పండితులు తెలిపారు. ప్రస్తుతం అక్కమహాదేవి గుహలుగా పిలువబడుతున్న ఇక్కడి గుహలలో కొంతకాలం, కథళీవనంలో కొంతకాలం తపస్సు చేసి సిద్ధి పొందారన్నారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి ప్రతిరోజు కూడా పూజలు నిర్వహిస్తామన్నారు. అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని సాయంత్రం భ్రామరీ కళావేదికపై అక్కమహాదేవి జీవిత విశేషాలపై డాక్టర్ ఎం.మహంతయ్య వారి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.


