కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అందరికీ పెద్ద దిక్కులాంటిది. జిల్లా నలుమూలలతో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం ఈ ఆసుపత్రిని నమ్ముకుని చికిత్స కోసం రోగులు వస్తుంటారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైద్యం అందించాల్సిన ప్రభుత్వం తూతూ మంత్రంగా సేవలందిస్తోంది. సగానికి పైగా మందులు, వైద్యపరీక్షలు బయటకు వెళ్తున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగుల మామూళ్ల దందా ఆగడం లేదు. మధ్యలో ఆగిపోయిన ఐపీ బిల్డింగ్ నిర్మాణంతో పడకలు చాలక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాదిన్నర తర్వాత నేడు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం.
మందుల కొరత తీవ్రం
ఆసుపత్రిలో ప్రస్తుతం 324 రకాల మందులు అందుబాటులో ఉండగా 47 రకాల మందుల కొరత ఉంది. ప్రధానంగా ఆల్బుమిన్స్, ఇన్సులిన్, పలు రకాల యాంటిబయాటిక్స్ మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్‌శాంపిల్ ట్యూబ్‌లు, కొన్ని మాత్రమే ఇస్తున్నారు. ఎక్కువగా బయటకు రాస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందుల సరఫరా సరిగ్గా లేకపోవడంతో స్థానికంగానే అధికారులు మందులు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్సులిన్, ఆల్బుమిన్ ఇంజెక్షన్లు ఎక్కువగా స్థానికంగానే కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా రోగులకు అరకొరగా ఇస్తున్నారు. గతంలో ఇన్సులిన్‌ను నెలకు సరిపోయే బాటిళ్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటి మాత్రమే చేతిలో పెట్టి పంపిస్తున్నారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు జిల్లా నుంచే గాక నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, రాయచోటి, ప్రకాశం జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి రోజూ 2,500 మంది దాకా ఓపీ, 1,500 మంది ఇన్ పేషంట్లు చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు పీజీ వైద్య విద్యార్థులు ఆయా విభాగాల్లో అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాల్సి ఉంది. కానీ అనేక ఓపీ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండటం లేదు. వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్తున్నారు. మరికొన్ని సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసలు ఓపీ నిర్వహించడం లేదు. నేరుగా వార్డుకు రమ్మని చెబుతున్నారు. అక్కడ వైద్యులు సకాలంలో ఉండటం లేదు. పీజీ వైద్యులే వారికి చికిత్స అందించి పంపిస్తున్నారు.
ఆగిన ఐపీ భవనం నిర్మాణంతో ఇక్కట్లు
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా బోధనాసుపత్రిని రూ.500 కోట్లతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇన్‌పేషంట్ భవనాన్ని నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెనుక వైపున దీని నిర్మాణం 2023లో జోరుగా సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల లేమితో పనులు ఆగిపోయాయి. 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనం నిర్మాణం పూర్తయితే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జికల్ విభాగాలన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుతం పాత భవనాలన్నీ కూల్చివేయడంతో ఇతర విభాగాల్లో అసౌకర్యాల మధ్య రోగులు చికిత్స అందుకుంటున్నారు.
వైద్యసేవ కార్డు ఉంటేనే ఉచితం
ప్రభుత్వ సర్వజన వైద్యశాల అంటే ఉచితంగా వైద్యసేవలు అందించాలి. ఈ మేరకు అవసరమైన నిధులను ప్రభుత్వం పన్నుల ద్వారా ప్రజల నుంచే సేకరిస్తుంది. ఆ సొమ్ముతోనే వైద్యులు, ఉద్యోగులు, వైద్య సిబ్బందికి, ఆసుపత్రి నిర్వహణకు ఖర్చు పెడుతుంది. కానీ ఈ ఆసుపత్రిలో మాత్రం ఎన్‌టీఆర్ వైద్యసేవ కార్డు లేకపోతే కొన్ని విభాగాల్లో సేవలు అందడం లేదు. వైద్యుల సేవలు మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు, మందులు, సర్జికల్స్ రోగులే బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఖర్చుచేసే స్థోమత లేకపోతే వెనక్కి పంపిస్తున్నారు. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. తెలంగాణ, కర్ణాటక ప్రాంతానికి చెందిన రోగులకు కేవలం వైద్యుల సేవలు మాత్రమే అందుతున్నాయి. ఆసుపత్రిలో చేరితే ఇతర ఖర్చులన్నీ వారు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
వైద్యుల పోస్టుల ఖాళీలతో ఇబ్బందులు
బోధనాసుపత్రిలో 224 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా అందులో ప్రస్తుతం 45 పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. అలాగే 71 ప్రొఫెసర్ పోస్టులకు గాను 63 మంది పనిచేస్తుండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నా యి. 69 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు గా ను 57 మంది పనిచేస్తుండగా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఆయా విభాగాల్లో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యథేచ్ఛగా ప్రైవేటు ల్యాబ్‌లకు పరీక్షలు
ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో అన్ని పరీక్షలు చేయాలి. ఈ మేరకు అవసరమైన కిట్లను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు. కానీ కొందరు వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు పలు రకాల వైద్యపరీక్షలు బయటకు రాస్తున్నారు. ప్రత్యేకంగా ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు ల్యాబ్ పేరు చెప్పి పంపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆసుపత్రి రివాల్వింగ్ గేటు వద్ద సదరు ల్యాబ్‌కు చెందిన వ్యక్తులు కాపుకాసి మరీ వారిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేసి పంపిస్తున్నారు. రాత్రి పూట అయితే అత్యవసరంగా డయాగ్నోస్టిక్ బ్లాక్‌లో చేయరని సాకుగా చూపి ప్రైవేటుకు వైద్యపరీక్షలు పంపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న
పెద్దాసుపత్రి
మందులు, వైద్యపరీక్షలు బయటకే...!
తూతూ మంత్రంగా వైద్యసేవలు
ప్రైవేటులో రోగుల జేబులు ఖాళీ
నేడు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ
సమావేశం
పెద్ద దిక్కులేదు!
పెద్ద దిక్కులేదు!


