ముస్లింల పట్ల అంకితభావం చాటుకున్న వైఎస్సార్‌సీపీ
● వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు,
మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు(టౌన్): వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింం పట్ల అంకితభావం చాటుకుందని ఆ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ విధానాలను అనుసరిస్తోందన్నారు. ముస్లింలకు మంచి చేసే సంస్థలను నీరుగార్చే విధంగా కేంద్రంలోని బీజేపీ కూటమి కుయుక్తులకు పాల్పడుతోందన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజం వక్ఫ్ బిల్లుపై అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయన్నారు. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనం వీడటం లేదని ప్రశ్నించారు.
నేటి నుంచి చేపలవేట నిషేధం
శ్రీశైలం ప్రాజెక్ట్: మత్స్యసంపద అభివృద్ధి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్రం వ్యాప్తంగా చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. చేపల పునరుత్పత్తి ఈ రెండు నెలల్లో అధికంగా ఉంటుంది. మత్స్యకారులు వేట కొనసాగిస్తే పెద్ద చేపలతో పాటు చిన్న చేపలు కూడా అంతరించే ప్రమాదం ఉంది. కృష్ణా నదీ తీరం వెంట, శ్రీశైలండ్యాం ఎగువ, దిగువ ప్రాంతాల్లో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


