రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
కర్నూలు(అర్బన్): భారతదేశానికి దశ, దిశ చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించడం ఆయనను అవమానించడమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి స్థానిక పాతబస్టాండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌వీ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని నామమాత్రంగా నిర్వహించేందుకు ఈ నెల 4న సర్కులర్ పంపిందన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచి జయంతి ఉత్సవాలను నిర్వహించడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్‌టీఆర్ జయంతిని మహానాడు పేరుతో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న టీడీపీ, అంబేడ్కర్ జయంతి పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కార్యక్రమంలో డీవీఎంసీ సభ్యులు గద్ద రాజశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కార్పొరేటర్లు విక్రమ్ సింహారెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, గడ్డం రామక్రిష్ణ, సీహెచ్ మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు తీరని అవమానం
చాక్లెట్లు, బిస్కెట్లు పంచి
తూతూ మంత్రంగా జయంతి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్‌వీ మోహన్‌రెడ్డి


